Border-Gavaskar trophy: మేము మేము బానే ఉంటాం!..ఆస్ట్రేలియా జట్టులో చీలికలు వస్తున్నాయన్న వారి నోరు మూయించిన సీనియర్ ప్లేయర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో విభజన ఉన్నట్లు వచ్చిన పుకార్లను కెప్టెన్ పాట్ కమిన్స్ ఖండించారు. జట్టు అంతర్గత వాతావరణం బాగా ఉందని స్పష్టం చేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టుకు జట్టు మరింత సమష్టిగా విజయం కోసం సిద్ధమవుతుందని తెలిపారు.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చీలిక పుకార్లపై వస్తున్న వార్తలపై కెప్టెన్ పాట్ కమిన్స్ స్పష్టతనిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ పుకార్లలో ఏ మాత్రం నిజం లేదని, జట్టు చుట్టూ ఉన్న పరిసరాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.
పెర్త్ టెస్టులో 3వ రోజు అనుభవజ్ఞుడైన పేసర్ జోష్ హాజిల్‌వుడ్ చేసిన ఒక వ్యాఖ్య కారణంగా ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభజన ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. హాజిల్‌వుడ్ మాట్లాడుతూ, “బ్యాటర్‌లలో ఎవరికైనా ఆ ప్రశ్న అడగండి. నేను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. ఫిజియోతో కొన్ని చికిత్సలు చేసుకుంటున్నాను. తదుపరి టెస్టుపై దృష్టి పెట్టాను,” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన కమిన్స్, “జట్టు చాలా బాగా ఉంది. కొంతమంది కామెంటేటర్లు జట్టును తప్పుగా అర్థం చేసుకున్నారు. టీమ్ అందరి మద్దతుతో పటిష్టంగా ఉంది. జట్టులో ఏ విభజన లేదని స్పష్టం చేస్తున్నాను,” అని అన్నారు.
భారత జట్టుతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో, ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే ఆలౌటైనప్పటికీ, భారత్ విజృంభించి 295 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో, రెండో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయం కారణంగా ఆడలేకపోతుండటంతో, స్కాట్ బోలాండ్‌ను జట్టులో చేర్చారు.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా జట్టు పుకార్లకు ముగింపు పలుకుతూ, మరో విజయం కోసం సిద్ధమవుతుందని కెప్టెన్ కమిన్స్ ధృడంగా పేర్కొన్నారు.



