Phil Salt: 13 ఫోర్లు, 3 సిక్సర్లు.. 41 బంతుల్లో ఊచకోత.. పాక్ బౌలర్లకు చుక్కలే..
ప్రతీ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల బ్యాటర్లు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటిదాకా..
టీ20 మ్యాచ్ జరుగుతోందంటే.. కచ్చితంగా బ్యాటర్లదే హవా కొనసాగుతుంది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇదే సీన్ రిపీట్ అయింది. ప్రతీ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల బ్యాటర్లు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఐదు మ్యాచ్‌లలోనూ రెండుసార్లు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఊచకోత కోయగా.. మూడుసార్లు పాక్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఇక తాజాగా జరిగిన ఆరో టీ20లో ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ రెచ్చిపోయాడు. 41 బంతుల్లోనే వీరోచిత ఇన్నింగ్స్ ఆడి.. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. వెరిసి 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-3తో సమం చేసింది. శుక్రవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఆరో టీ20లో ఇంగ్లాండ్ పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆకాశమే హద్దుగా బౌలర్లపై చెలరేగిపోయాడు. తద్వారా ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది..
41 బంతుల్లో ఫిల్ స్లాట్ ఊచకోత..
170 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో ఇంగ్లాండ్‌కు ఓపెనర్‌గా దిగిన ఫిల్ సాల్ట్.. 41 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి.. చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. సాల్ట్ మొదటి బంతి నుంచే ఊచకోత ప్రారంభించాడు.. ప్రతీ బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుని స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అటు ఫిల్ సాల్ట్ దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు కేవలం 7 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది.
ఇక సాల్ట్‌తో పాటు మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్(27), డేవిడ్ మలాన్(26), బెన్ డకెట్(26*) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ విజయం సునాయాసం అయింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్(87) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. కాగా, ఆఖరి టీ20 ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇందులో ఎవరు గెలిస్తే.. వారే సిరీస్ కైవసం చేసుకుంటారు.