Asia Cup 2023: పాక్‌లో పర్యటించేదేలే.. తటస్థ వేదికలోనే ఆ కీలక టోర్నీ.. పీబీసీకి భారీ షాకిచ్చిన జైషా..

ఆసియా కప్ 2023 తటస్థ వేదికలో జరుగుతుందని జైషా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Asia Cup 2023: పాక్‌లో పర్యటించేదేలే.. తటస్థ వేదికలోనే ఆ కీలక టోర్నీ.. పీబీసీకి భారీ షాకిచ్చిన జైషా..
India Vs Pakisthan
Follow us

|

Updated on: Oct 18, 2022 | 2:40 PM

వచ్చే ఏడాది ఆసియా కప్ క్రికెట్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదు. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా మంగళవారం ధృవీకరించారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికలో జరుగుతుందని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. జైషా మాట్లాడుతూ- ఆసియా కప్ 2023 తటస్థ వేదికపై జరుగుతుంది. మా జట్టును పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. కాబట్టి మేం దానిపై వ్యాఖ్యానించలేం. కానీ 2023 ఆసియా కప్ కోసం టోర్నమెంట్ తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయించాం.

వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్..

టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు గతంలో మీడియా కథనాలలో వెల్లడించింది. బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా ఇప్పుడు ఈ వార్తలను ఖండించారు. వచ్చే ఏడాది ఆసియాకప్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించాలని ముందుగా నిర్ణయించగా, ఇప్పుడు ఆతిథ్యాన్ని పాక్ నుంచి లాగేసుకున్నారు. 2023లో జరగనున్న తదుపరి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది.

ఇవి కూడా చదవండి

తొమ్మిదేళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడని దాయాది దేశాలు..

భారత్‌, పాకిస్థాన్‌లు తొమ్మిదేళ్లుగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. ఈ రెండు జట్ల మధ్య చివరిగా 2012 డిసెంబర్‌లో టీ20, వన్డే సిరీస్‌లు జరిగాయి. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేయగా, వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-1తో కైవసం చేసుకుంది. అదే సమయంలో 2007-08 సీజన్ నుంచి టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు పోటీ పడలేదు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్‌లో పర్యటించలేదు. అదే సమయంలో నియంత్రణ రేఖపై నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తర్వాత ఈ సంబంధం మరింత దిగజారింది. రెండు పొరుగు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త రాజకీయ సంబంధాల కారణంగా, రెండు జట్లు ఆసియా కప్, ICC ఈవెంట్‌లలో మాత్రమే తలపడుతున్నాయి.