T20 World Cup 2026: బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్.. టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటామంటూ బెదిరింపులు..?
PCB - BCB: పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ వ్యవహారాల్లో ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లా తప్పుకుంటే, పాక్ జట్టు కూడా తప్పుకుంటుందని బెదిరింపులు మొదలుపెట్టింది.

Pakistan-Bangladesh,T20 World Cup: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పిచ్చి పట్టినట్లుంది. భారత్, బంగ్లాదేశ్ వివాదంలో తలదూర్చేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనాలా వద్దా అనే అంశం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సంబంధించినది. అయితే, పీసీబీ కూడా అంతే ఆసక్తి కలిగి ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాల మేరకు, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు గురించి పెరుగుతున్న ఆందోళనల దృష్ట్యా, భారతదేశంలో జరిగే 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పాల్గొనడాన్ని సమీక్షిస్తుందని అక్కడి మీడియా పేర్కొంది.
పాకిస్తాన్ మద్దతు కోరిన బంగ్లాదేశ్?
భద్రతా అంశాలపై మద్దతు కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను సంప్రదించిందని, ఆ తర్వాత పాకిస్తాన్ ఈ వైఖరిని అవలంబించిందని చెబుతున్నారు. జియో సూపర్ టీవీ నివేదిక ప్రకారం, ఆతిథ్య బాధ్యతలకు సంబంధించి ఏ దేశం ఒత్తిడి లేదా బెదిరింపులను ఎదుర్కోకూడదని పాకిస్తాన్ నొక్కి చెప్పింది. ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు తన పూర్తి మద్దతును హామీ ఇచ్చింది.
బంగ్లాదేశ్ అంశంపై పాకిస్తాన్ ఆసక్తి..
అయితే, ఈ నివేదికకు ముందే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ సమస్యపై చాలా ఆసక్తిని కలిగి ఉంది. జనవరి 11న, టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను నిర్వహించాలనే తన కోరికను వ్యక్తం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ భారతదేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్న తర్వాత పాకిస్తాన్ ఈ కోరికను వ్యక్తం చేసింది. అయితే, బంగ్లాదేశ్ మ్యాచ్‌లను నిర్వహించాలనే పాకిస్తాన్ కోరిక అధికారికం కాదని, శ్రీలంకలో స్టేడియం అందుబాటులో లేనట్లయితే మాత్రమే అని పీసీబీ వర్గాలు తరువాత నివేదించాయి.
పాకిస్తాన్‌లోని అన్ని స్టేడియంలు టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పీసీబీ వర్గాలు చెప్పినట్లు నివేదిక పేర్కొంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ఉమెన్స్ క్వాలిఫైయర్‌తో సహా ప్రధాన ఐసీసీ ఈవెంట్‌లను పాకిస్తాన్ విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు.




