On This Day: టెస్టుల్లో టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. కట్ చేస్తే.. 84 ఏళ్ల రికార్డు బ్రేక్.. ఎవరో తెలుసా?

టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేయడమంటే పెద్ద విషయమే. సచిన్, సునీల్ గవాస్కర్ లాంటి ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సైతం..

On This Day: టెస్టుల్లో టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. కట్ చేస్తే.. 84 ఏళ్ల రికార్డు బ్రేక్.. ఎవరో తెలుసా?
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 18, 2023 | 6:44 PM

టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేయడమంటే పెద్ద విషయమే. సచిన్, సునీల్ గవాస్కర్ లాంటి ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సైతం ఈ ఘనత సాధించింది లేదు. అయితే ఇప్పుడు టెస్టుల్లో ప్రతీ జట్టు నుంచి ఒకరిద్దరు ట్రిపుల్ సెంచరీలు బాదేస్తున్నారు. అయితే న్యూజిలాండ్ జట్టు నుంచి కేవలం ఒక బ్యాట్స్‌మెన్ మాత్రమే ట్రిపుల్ సెంచరీ చేశాడు. అది కూడా టీమిండియాపైన ఈ రికార్డు సృష్టించాడు. అతడు మరెవరో కాదు ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్. ఈ రోజున అనగా 2014 ఫిబ్రవరి 18న వెల్లింగ్టన్‌లో తన ట్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు ఈ అమేజింగ్ ప్లేయర్.

ఆ సమయంలో భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్ 2014, ఫిబ్రవరి 14న వెల్లింగ్టన్‌లో ప్రారంభమైంది. ఈ మ్యాచ్ చివరి రోజున న్యూజిలాండ్ కెప్టెన్ మెక్‌కల్లమ్ ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసి, తన దేశం తరఫున ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 571 పరుగులు చేసింది. మెక్‌కల్లమ్ ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోర్ 281 పరుగులతో ప్రారంభించి, తొలి సెషన్‌లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. అయితే, ట్రిపుల్ సెంచరీ పూర్తికాగానే అతడు పెవిలియన్ చేరాడు. మొత్తానికి మెక్‌కల్లమ్ 559 బంతులు ఎదుర్కొని 32 ఫోర్ల సాయంతో 302 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ జట్టు 1929లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. అప్పటినుంచి 2014 వరకు టెస్టుల్లో ఆ జట్టు బ్యాటర్ ఎవరూ ట్రిపుల్ సెంచరీ సాధించలేకపోయారు. 2014లో బ్రెండన్ ఈ ఘనత సాధించి 84 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు.

అలాగే ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన జేమ్స్ నీషమ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి, ఏడో వికెట్‌కు వాట్లింగ్‌తో కలిపి 179 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకుముందు మెక్‌కల్లమ్ బీజే వాట్లింగ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 352 పరుగులు జోడించాడు. టెస్టుల్లో ఆరో వికెట్‌కి ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. వాట్లింగ్ 124 పరుగులు చేయగా.. నీషమ్ 137 పరుగులు సాధించాడు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 438 పరుగులు చేసి న్యూజిలాండ్‌పై 246 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీనితో కెప్టెన్ మెకల్లమ్, వాట్లింగ్, నీషమ్ కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్ల నష్టానికి 680 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చివరి రోజు భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 105 పరుగులతో అజేయంగా నిలిస్తే.. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితం ఏది లేకపోవడమతో చివరికి అంపైర్లు ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.