Ollie Robinson: తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఇది కదా కమ్‌బ్యాక్ అంటే..! నెక్ట్స్ లెవెల్ విధ్వంసం..
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఓలీ రాబిన్సన్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌కు పైచేయి సాధించాడు. తన తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కుదేలు చేశాడు. హ్యారీ బ్రూక్ అర్ధశతకం, రాబిన్సన్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. న్యూజిలాండ్ తొలి రోజు ముగిసే సమయానికి తీవ్ర ఒత్తిడిలో పడింది.

న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజే ఆసక్తికర మలుపు తిరిగింది. ఇంగ్లండ్ సీమర్ ఓలీ రాబిన్సన్ అద్భుత బౌలింగ్‌తో చెలరేగి, ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుప్పకూల్చడంతో మ్యాచ్‌పై ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండేళ్లకు పైగా జట్టుకు దూరంగా ఉన్న రాబిన్సన్, తిరిగి జట్టులోకి వచ్చి తన ప్రతిభను ఘనంగా చాటుకున్నాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ ధాటికి కేవలం 140 పరుగులకే ఆలౌటైంది. జేమీసన్ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. అయితే బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లండ్ బౌలర్లు కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే ఓలీ రాబిన్సన్ తన మూడో బంతికే డెవాన్ కాన్వేను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు. అనంతరం స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను షార్ట్ లెగ్ వద్ద క్యాచ్ రూపంలో ఔట్ చేసి కివీస్‌కు భారీ షాక్ ఇచ్చాడు. ఆ వెంటనే రచిన్ రవీంద్రను కూడా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేస్తూ తన తొలి ఓవర్‌ను ట్రిపుల్ వికెట్ మెయిడెన్‌గా ముగించాడు. దీంతో లార్డ్స్ మైదానం ఒక్కసారిగా ఉత్సాహంతో మార్మోగిపోయింది. అక్కడితో ఆగని రాబిన్సన్, డారిల్ మిచెల్ వికెట్‌ను కూడా ఖాతాలో వేసుకుని న్యూజిలాండ్‌ను 10 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయేలా చేశాడు. మరోవైపు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ కూడా చెరో వికెట్ సాధించడంతో కివీస్ స్కోరు 29/6గా మారింది. తొలి రోజు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 61/6 స్కోరుతో నిలిచి, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 79 పరుగులు వెనుకబడి ఉంది.
Dot. Dot. Wicket. Dot. Wicket. Wicket.
Every ball from that ridiculous Ollie Robinson over 👇 pic.twitter.com/A5jhEgkV1p
— England Cricket (@englandcricket) June 4, 2026
ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో హ్యారీ బ్రూక్ 56 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. కఠిన పరిస్థితుల్లో హాఫ్ సెంచరీతో టీమ్‌ను ఆదుకున్నాడు. ప్రస్తుతం మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుండగా, రెండో రోజు న్యూజిలాండ్ బ్యాటర్లు ఎలా ప్రతిస్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాబిన్సన్ కమ్‌బ్యాక్ ఇంగ్లండ్ బౌలింగ్ విభాగానికి కొత్త ఊపునిచ్చిందని చెప్పొచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
