IND Vs NZ: రోకో ఎంట్రీ ఇచ్చేశారు.. న్యూజిలాండ్ బౌలర్లకు ఇక దబిడి దిబిడేనా..!
IND Vs NZ: న్యూజిలాండ్‌తో నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సిద్ధమయ్యారు. ఈ ఇద్దరూ నెల రోజుల విరామం తర్వాత మైదానంలోకి దిగనున్నారు. కోహ్లీకి కివీస్‌పై 2,000 వన్డే పరుగుల రికార్డు సాధించే అవకాశం ఉంది.

IND Vs NZ: టీమిండియా అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ వన్డే క్రికెట్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. న్యూజిలాండ్‌తో నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఇప్పటికే కివీస్ గడ్డపై అడుగుపెట్టారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్, కోహ్లీ కూడా జట్టుతో చేరారు. ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ కొనసాగుతుండగా, అందులో టీమిండియా 3-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత వన్డే పోరు మొదలవుతుంది. రోహిత్, కోహ్లీ చివరిసారిగా అక్టోబర్ 3న వెస్టిండీస్‌తో వన్డే ఆడారు. ఇప్పుడు సరిగ్గా నెల రోజుల విరామం తర్వాత మళ్లీ బ్యాట్ పట్టనున్నారు.
ఐదు మ్యాచ్‌లు.. ఎక్కడెక్కడంటే?
భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ నవంబర్ 4న ఆక్లాండ్‌లో మొదలవుతుంది. రెండో మ్యాచ్ నవంబర్ 7న వెల్లింగ్టన్లో జరుగుతుంది. మూడో వన్డే నవంబర్ 10న హామిల్టన్‌లో నిర్వహించనున్నారు. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లు మౌంట్ మాంగనూయ్‌లో జరగనున్నాయి. నాలుగో వన్డే నవంబర్ 13న, చివరి మ్యాచ్ నవంబర్ 15న షెడ్యూల్ చేశారు. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ రోహిత్, కోహ్లీ ఆడే అవకాశం ఉందని కథనం పేర్కొంది. అయితే తుది జట్టు ఎంపిక, ఆటగాళ్ల ఫిట్నెస్ను బట్టి మ్యాచ్‌ల్లో వారి భాగస్వామ్యం ఖరారవుతుంది.
రోహిత్ ఫామ్ మామూలుగా లేదు
ఈ ఏడాది వన్డేల్లో రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌ల్లో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా పరుగుల వేటలో వెనక్కి తగ్గడం లేదు. 2026లో ఇప్పటివరకు తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 69 సగటుతో 552 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
కోహ్లీ ముందు చరిత్ర సృష్టించే ఛాన్స్
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కివీస్‌పై 36 ఇన్నింగ్స్‌లు ఆడి 1,897 పరుగులు చేశాడు. మరో 103 పరుగులు సాధిస్తే న్యూజిలాండ్‌పై వన్డేల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ ఘనత సాధిస్తే కోహ్లీ ఖాతాలో మరో ప్రత్యేక రికార్డు చేరుతుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ మైలురాయిని అందుకుంటాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జట్టులో మార్పులు.. ప్రసిద్ధ్‌కు గాయం
ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించినట్లు బీసీసీఐ తెలిపింది. మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డి తొలి మూడు వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. చివరి రెండు మ్యాచ్‌లకు దూరమై, ఇండియా-ఎ తరఫున మూడో అనధికారిక టెస్టు ఆడనున్నాడు. రాబోయే టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కావడమే ఇందుకు కారణం. మొత్తానికి రోహిత్, కోహ్లీ రీఎంట్రీతో ఈ వన్డే సిరీస్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
భారత్, న్యూజిలాండ్ వన్డే షెడ్యూల్ 2026:
* నవంబర్ 4 – తొలి వన్డే – ఆక్లాండ్
* నవంబర్ 7 – రెండో వన్డే – వెల్లింగ్టన్
* నవంబర్ 10 – మూడో వన్డే – హామిల్టన్
* నవంబర్ 13 – నాలుగో వన్డే – మౌంట్ మాంగనూయ్
* నవంబర్ 15 – ఐదో వన్డే – మౌంట్ మాంగనూయ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
