నంబర్ 11ఐనా తగ్గేదేలే.. ఓపెనర్ నుంచి టెయిలెండర్ వరకు వన్డేల్లో ఈ రికార్డులు ఎవరివో తెలుసా?
Most Sixes At Each Batting Position: వన్డే క్రికెట్లో సిక్సర్లు బాదడం అంటే సాధారణంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లకే సాధ్యమని అనుకుంటాం. కానీ చివరి స్థానంలో వచ్చే బౌలర్లు కూడా అప్పుడప్పుడు బ్యాటర్లకు షాకిస్తుంటారు. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ నాలుగు సిక్సర్లతో మెరిపించాడు. ఈ సందర్భంగా వన్డేల్లో ఒక్కో బ్యాటింగ్ స్థానంలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల రికార్డులు ఆసక్తికరంగా మారాయి.

Most Sixes At Each Batting Position: వన్డే క్రికెట్లో భారీ సిక్సర్లు బాదడం అనగానే రోహిత్ శర్మ (Rohit Sharma), క్రిస్ గేల్ (Chris Gayle), ఏబీ డివిలియర్స్ (AB de Villiers) వంటి విధ్వంసకర బ్యాటర్లు గుర్తుకొస్తారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో చివరి స్థానంలో వచ్చే ఆటగాళ్లు కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో బ్లెయిర్ టిక్నర్ (Blair Tickner) ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు. న్యూజిలాండ్ 146/9తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. జాకబ్ డఫీతో కలిసి చివరి వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. దీంతో నంబర్ 11లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మహమ్మద్ అమీర్, నసీమ్ షా సరసన నిలిచాడు.
ఒక్కో బ్యాటింగ్ స్థానంలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..
1. నంబర్ 1 – రోహిత్ శర్మ (16 సిక్సర్లు)
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2013లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 సిక్సర్లు బాదాడు. భారత్ 383/6 స్కోరు చేయగా, 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2. నంబర్ 2 – క్రిస్ గేల్ (16 సిక్సర్లు)
2015 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 147 బంతుల్లో 215 పరుగులు చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు కొట్టాడు. వెస్టిండీస్ 372/2 స్కోరు చేసి 73 పరుగులతో గెలిచింది.
3. నంబర్ 3 – ఏబీ డివిలియర్స్ (16 సిక్సర్లు)
మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ 2015లో జోహన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌పై కేవలం 44 బంతుల్లోనే 149 పరుగులు చేశాడు. ఇందులో 16 సిక్సర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా 439/2 భారీ స్కోరు సాధించి 148 పరుగుల తేడాతో గెలిచింది.
4. నంబర్ 4 – ఇయాన్ మోర్గాన్ (17 సిక్సర్లు)
ఈ స్థానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2019 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై కేవలం 71 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ప్రపంచకప్ వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 17 సిక్సర్లు బాదాడు.
5. నంబర్ 5 – జస్కరన్ మల్హోత్రా (16 సిక్సర్లు)
అమెరికా క్రికెటర్ జస్కరన్ మల్హోత్రా 2021లో పపువా న్యూ గినియాపై 124 బంతుల్లో అజేయంగా 173 పరుగులు చేశాడు. ఇందులో 16 సిక్సర్లు ఉన్నాయి. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదడం ఈ ఇన్నింగ్స్‌లో మరో ప్రత్యేకత.
6. నంబర్ 6 – గ్లెన్ మ్యాక్స్‌వెల్, కీరన్ పొలార్డ్, కుశాల్ మల్ల (10 సిక్సర్లు)
ఈ స్థానంలో ముగ్గురు ఆటగాళ్లు సంయుక్తంగా రికార్డు పంచుకుంటున్నారు. 2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై గ్లెన్ మ్యాక్స్‌వెల్ 128 బంతుల్లో అజేయంగా 201 పరుగులు చేశాడు. 10 సిక్సర్లు బాదాడు. ఆస్ట్రేలియా 91/7తో ఓటమి అంచున ఉన్నప్పటికీ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో గెలిపించాడు.
2011లో భారత్‌పై కీరన్ పొలార్డ్ 119 పరుగులు చేసి 10 సిక్సర్లు కొట్టాడు. 2023 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో నేపాల్ ఆటగాడు కుశాల్ మల్ల ఒమన్‌పై 64 బంతుల్లో 108 పరుగులు చేసి 10 సిక్సర్లు బాదాడు.
7. నంబర్ 7 – తిసారా పెరీరా (13 సిక్సర్లు)
శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ తిసారా పెరీరా 2019లో న్యూజిలాండ్‌పై 74 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు బాదాడు. అయితే అతడి పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. శ్రీలంక 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
8. నంబర్ 8 – మాథ్యూ ఫోర్డ్ (8 సిక్సర్లు)
వెస్టిండీస్ ఆటగాడు మాథ్యూ ఫోర్డ్ 2025 మేలో ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో కేవలం 19 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయడం విశేషం. వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఫలితం తేలలేదు.
9. నంబర్ 9 – డారెన్ సామీ (6 సిక్సర్లు)
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ 2012లో ఆస్ట్రేలియాపై జరిగిన ఐదో వన్డేలో 50 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు ఉన్నాయి. అయితే వెస్టిండీస్ 251 పరుగులకే ఆలౌటై 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.
10. నంబర్ 10 – రవి రాంపాల్, దౌలత్ జద్రాన్ (6 సిక్సర్లు)
ఈ స్థానంలో వెస్టిండీస్ బౌలర్ రవి రాంపాల్, ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ దౌలత్ జద్రాన్ సంయుక్తంగా ఉన్నారు. 2011లో భారత్‌పై రాంపాల్ 66 బంతుల్లో అజేయంగా 86 పరుగులు చేశాడు. ఆరు సిక్సర్లు బాదాడు. కెమర్ రోచ్‌తో కలిసి చివరి వికెట్‌కు 99 పరుగులు జోడించాడు. 2018లో జింబాబ్వేపై జద్రాన్ 29 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేసి ఆరు సిక్సర్లు కొట్టాడు.
11. నంబర్ 11 – మహమ్మద్ అమీర్, నసీమ్ షా, బ్లెయిర్ టిక్నర్ (4 సిక్సర్లు)
చివరి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆటగాళ్లు సాధారణంగా బౌలింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెడతారు. కానీ ఈ ముగ్గురు మాత్రం బ్యాట్‌తోనూ మెరిశారు. 2016లో ఇంగ్లండ్‌పై మహమ్మద్ అమీర్ 28 బంతుల్లో 58 పరుగులు చేసి నాలుగు సిక్సర్లు కొట్టాడు. 2025లో న్యూజిలాండ్‌పై నసీమ్ షా 44 బంతుల్లో 51 పరుగులు చేసి నాలుగు సిక్సర్లు బాదాడు. తాజాగా 2026లో భారత్‌పై బ్లెయిర్ టిక్నర్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి నాలుగు సిక్సర్లతో ఈ జాబితాలో చేరాడు.
చివరిగా..
వన్డే క్రికెట్లో సిక్సర్ల రికార్డులు కేవలం స్టార్ బ్యాటర్లకే పరిమితం కావని ఈ జాబితా స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నంబర్ 11లో ఉండే బౌలర్లు సైతం మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా భారీ షాట్లు ఆడగలరని టిక్నర్ మరోసారి చూపించాడు. టాప్ ఆర్డర్లో రోహిత్, గేల్, డివిలియర్స్ విధ్వంసం సృష్టిస్తే.. చివరి స్థానంలోనూ అమీర్, నసీమ్, టిక్నర్ తమదైన ముద్ర వేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
