34 ఫోర్లు, 25 సిక్సర్లతో 459 పరుగులు.. 8గురి బౌలర్లపై వీరవిహారం.. ఊచకోత మాములుగా లేదుగా..
మరో టీ20 మ్యాచ్.. మళ్లీ బౌలర్లది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. ఆకాశమే హద్దుగా బ్యాటర్లు చెలరేగిపోయారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ..

మరో టీ20 మ్యాచ్.. మళ్లీ బౌలర్లది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. ఆకాశమే హద్దుగా బ్యాటర్లు చెలరేగిపోయారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి ఏకంగా 459 పరుగులు బాదేశారు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ టోర్నమెంట్‌లో చోటు చేసుకుంది. మరి ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఓ లుక్కేద్దాం పదండి..
జనవరి 5వ తేదీన అడిలైడ్ వేదికగా హోబర్ట్ హర్రికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత అడిలైడ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. హోబర్ట్ హర్రికేన్స్ ఓపెనర్లు బెన్ మెక్‌డెర్మోట్(57), కలెబ్ జెవెల్(54) అర్ధ సెంచరీలతో స్కోర్ బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. ఇక వీరితో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జాక్ క్రాలీ(54), టిమ్ డేవిడ్(39) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అడిలైడ్ బౌలర్లలో డిగ్రాండోమ్ 2 వికెట్లు, కాన్వే, షార్ట్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక 230 పరుగుల భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్‌కు.. ఆ జట్టు కెప్టెన్ మ్యాథ్యూ షార్ట్(100) సెంచరీతో కదంతొక్కాడు. అతడు 59 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు సెంచరీ చేశాడు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు క్రిస్ లిన్(64), ఆడమ్ హోస్(38) తుఫాన్ ఇన్నింగ్స్‌లు తోడవ్వడంతో మరో 3 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. హోబర్ట్ బౌలర్లలో డూలే 2 వికెట్లు, డేవిడ్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించిన మ్యాథ్యూ షార్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.