Match Fixing: అజహర్ మెడకు మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చు.. తరుముకొస్తున్న కమలనాథులు..

మాజీ భారత్ క్రికెట్ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తును…

Match Fixing: అజహర్ మెడకు మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చు.. తరుముకొస్తున్న కమలనాథులు..
Yendala Laxmi Narayana
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 22, 2021 | 3:48 PM

Match Fixing issue raising again against Azahar: మాజీ భారత్ క్రికెట్ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తును సీబీఐ పునర్విచారణ చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసిషన్ అధ్యక్షుడు, బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేయడమే ఇందుకు కారణం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి అజహర్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తానని యెండల ప్రకటించడంతో మరోసారి అజహర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై అజహర్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

భారత్ క్రికెట్ జట్టులో కొనసాగుతున్న రోజుల్లో అజహర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. 2000 సంవత్సరంలో తెరపైకి వచ్చింది మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం. దక్షిణాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రోనేను అజరుద్దీన్ బుకీస్‌కు పరిచయం చేశారనేది అప్పట్లో అజహర్‌పై మోపిన అభియోగం. ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా అజహర్‌పై బీసీసీఐ జీవిత కాలం నిషేధం విధించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేసింది. ఆ తర్వాత సాక్ష్యాల ఆధారంగా 2000 సంవత్సరంలో ఇటు అజహర్‌పైనా.. అటు హన్సీ క్రోనేపైనా జీవిత కాలం నిషేధం వేటు పడింది. అయితే.. జీవితకాలం నిషేధం విధించిన కొన్ని నెలలకే హన్సీ క్రోనే ఓ విమాన ప్రమాదంలో మరణించాడు. ఇటు అజహర్‌పై నిషేధం విధించడంతో ఆయన క్రికెట్‌కు దూరమయ్యారు. 2012 నవంబర్ 8వ తేదీన అజహర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అశుతోష్ మోహుంతా, కృష్ణమోహన్ రెడ్డి విచారణ జరిపి.. సరైన ఆధారాలు లేవంటూ కేసును కొట్టేశారు. దాంతో బీసీసీఐ అతనిపై నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన అజహర్ యుపీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై కన్నేసిన బీజేపీ నేత యెండల లక్షినారాయణ.. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీ.ఏ.) అధ్యక్షునిగా కొనసాగుతున్న అజహర్‌పై గురి పెట్టారు. అజహర్‌పై యెండల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అజహర్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసును పునర్విచారించాలని యెండల డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో త్వరలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి నివేదిస్తానని యెండల ప్రకటించారు. హెచ్.సీ.ఏ. ఆడిట్‌ రిపోర్టు లేకపోవడంతో ఐపీఎల్‌ మ్యాచులను హైదరాబాద్‌లో నిర్వహించడం లేదని యెండల ఆరోపిస్తున్నారు. ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీలలో ఆడే ప్లేయర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని యెండల ఆరోపించారు. రంజీ క్రికెట్‌ ఎంపికలోనూ అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

మంచి ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు హెచ్.సీ.ఏ.లో చోటు లేదనే వాదన బలంగా వుంది. హెచ్.సీ.ఏ.ను ప్రక్షాళన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రతిభ గల క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం లేదనే వాదన వుంది. హెచ్.సీ.ఏ. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అజహర్ కోర్టు నుంచి తాత్కాలిక అనుమతి మాత్రమే తెచ్చుకున్నారని యెండల అంటున్నారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అభియోగాల నుంచి అజహర్‌ తప్పించుకోలేరని యెండల అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ నుంచి అజహర్‌కు క్లీన్ చిట్ లేదని చెబుతున్నారు. 30 ఏళ్ల నుండి ఒక్క గ్రామీణ ప్లేయర్ రంజీ ట్రోఫీలో ఆడిన దాఖలాలు లేవని అంటున్నారు. హెచ్.సీ.ఏ.లో కేవలం 9 సంవత్సరాలకు మించి పదవుల్లో కొనసాగరాదన్న నిబంధనను తుంగలో తొక్కారని, కొందరు 20 ఏళ్ళుగా హెచ్.సీ.ఏ.పై పెత్తనం చేస్తూనే వున్నారని యెండల ఆరోపించారు.

హెచ్.సీ.ఏ.లో లుకలుకలు

హెచ్.సీ.ఏ.లో లుకలుకలు తీవ్రస్థాయికి చేరాయి. వర్గాలుగా విడిపోయిన హెచ్.సీ.ఏ. కార్యవర్గ సభ్యులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం కలిసి ఒక ప్యానల్‌గా హెచ్.సీ.ఏ. ఎన్నికల్లో పోటీ చేసిన వారే.. ఆ తర్వాత వర్గాలుగా విడిపోయి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ.. పోలీసు స్టేషన్లకు ఎక్కుతున్నారు. కలిసి మెలిసి ఘన విజయం సాధించిన అజహర్ ప్యానల్‌లోని వ్యక్తుల మధ్యే ప్రస్తుతం వివాదాలు రాజుకున్నాయి. హెచ్.సీ.ఏ. అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌కు, ఇతర అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు మధ్య వివాదం తీవ్రమైంది. పంచాయతీ పోలీస్ స్టేషన్‌ దాకా వెళ్ళింది. కొందరు హెచ్.సీ.ఏ. సభ్యులు తనను బహిరంగంగా తిట్టారంటూ అజహర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోశాధికారి సురేందర్‌ అగర్వాల్, మరో సభ్యుడు మొయిజుద్దీన్‌లపై అజహర్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు ఐపీసీ సెక్షన్‌ 504, 506ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ సందర్భంగా ఉప్పల్ పోలీస్‌ స్టేషన్‌లోను హెచ్.సీ.ఏ. కార్యవర్గ సభ్యులు గొడవ పడ్డారు. దాంతో వ్యవహారం రచ్చకెక్కింది.

ఇరు వర్గాలకు చెందిన వారు ఉప్పల్ పోలీసు స్టేషన్‌కు రావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సురేందర్‌ అగర్వాల్‌పై ఇంకో కేసు నమోదు చేశారు పోలీసులు. హెచ్‌సీఏ క్లబ్‌లకు రూ. 50 వేలు ఇస్తున్నారని చర్చ జరిగింది. హెచ్.సీ.ఏ. నిధులను కోశాధికారి సురేందర్‌ దుర్వినియోగం చేశారంటూ షాలీమార్‌ క్రికెట్‌ క్లబ్‌ యజమాని ఎజాజ్‌ అలీ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేందర్‌పై మరో కేసు కూడా నమోదైంది. హెచ్‌సీఏలో వివాదాల పరిష్కారం కోసం జస్టిస్‌ దీపక్‌ వర్మను అజహర్‌ అంబుడ్స్‌మన్‌ నియామించారు. కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత ఏజీఎంలో ఆమోద ముద్ర వేసిన తర్వాతే అంబుడ్స్‌మన్‌ నియామకం చేయాలని అజహర్ వైరి వర్గం పట్టు బట్టింది. క్లబ్‌ల పూర్తి వివరాలు, యజమానుల వివరాలు తనకు ఇవ్వాలంటూ అజహర్‌ లేఖ రాయడం కూడా వివాదాస్పదమైంది. అంబుడ్స్‌మన్‌ వస్తే కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ కింద తమకు ఇబ్బందులు ఎదురు కావచ్చని అజహర్ వ్యతిరేక వర్గం అనుమానించింది.

హెచ్‌సీఏలో పలువురు సభ్యులు అజహర్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారన్న కథనాలు వినిపిస్తున్నాయి. హెచ్.సీ.ఏ. అపెక్స్‌ కౌన్సిల్‌కు దీపక్‌ వర్మ లేఖ రాసి.. అంబుడ్స్‌మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. దాంతో కార్యదర్శి విజయానంద్‌ తదితరులపై అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌దే పైచేయి అయ్యింది. ఏకపక్షంగా అంబుడ్స్‌మన్‌ను నియమించారు. అది చెల్లదంటూ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు వాదిస్తున్నారు. అందరి అనుమతితోనే గత జూన్‌లోనే తనను ఎంపిక చేశారని దీపక్ వర్మ చెబుతున్నారు. కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నది దీపక్ వర్మ వాదన. తన నియామకాన్ని మళ్లీ ప్రశ్నిస్తే న్యాయపరంగా తగిన చర్య తీసుకుంటామని దీపక్ వర్మ హెచ్చరించారు. దీపక్ వర్మ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్‌ సంఘానికి కూడా అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తుండడం కూడా వివాదాస్పదం అవుతోంది.

ఇంకో వైపు దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీ కోసం హెచ్‌సీఏ 20 మందితో జట్టును ప్రకటించింది. జట్టు కోచ్‌గా రంజీ మాజీ ప్లేయర్‌ అనిరుధ్‌ సింగ్‌ను ఎంపిక చేసి.. ఆ తర్వాత తొలగించారు. అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్న జాకీర్‌ హుస్సేన్‌ను కొత్త కోచ్‌గా ప్రకటించారు. టీమ్‌ను ఎంపిక చేసే క్రమంలో హెచ్‌సీఏ నిర్వహిస్తున్న అంతర్గత టోర్నీ మ్యాచ్‌లకు అనిరుధ్ హాజరయ్యాడు. గత సీజన్‌లో అండర్‌–19 కోచ్‌గా వ్యవహరించిన అనిరుధ్‌‌ను సీజన్‌ మధ్యలోనే తొలగించారు. కెప్టెన్‌గా మళ్లీ తన్మయ్‌ అగర్వాల్‌నే ఎంపిక చేయడం కూడా వివాదాస్పదమైంది. తన్మయ్ సారథ్యంలో గత రంజీ సీజన్లో ఆడిన 8 మ్యాచుల్లో 6 మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. అయినా కెప్టెన్‌ని మార్చకపోవడంపై క్రికెట్ అభిమానులతోపాటు హెచ్.సీ.ఏ. కార్యవర్గ సభ్యులే విమర్శలు చేశారు.

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఎటువంటి లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ చల్లా కోదండరామ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. లీగ్‌ మ్యాచ్‌లలో ప్రతిభ కనబర్చిన వారికి స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే.. తమ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇస్తామని, అయితే లీగ్‌ మ్యాచ్‌లలో తమను ఆడనివ్వడం లేదంటూ యూనియన్‌ బ్యాంక్‌ పిటీషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హెచ్.సీ.ఏ. ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎటువంటి లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఈ ఆదేశాలపై హెచ్.సీ.ఏ. కౌంటర్ దాఖలు చేసింది. ఆ తర్వాత హైదరాబాదులో 2021 ఐపీఎల్ మ్యాచులు నిర్వహించకపోవడంపై వివాదం రాజుకుంది. హెచ్.సీ.ఏ. ప్రయత్నాలు చేయకపోవడం వల్లనే ఐపీఎల్ కౌన్సిల్ హైదరాబాద్‌ను వేదికగా పరిగణించలేదన్న విమర్శలు రావడంతో వాటిపై అజహర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బీసీసీఐకి, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు తాను ఇదివరకే లేఖలు రాశానని అజహర్ చెప్పుకొచ్చారు.

కోవిడ్ కారణంగానే హైదరాబాద్‌ను ఐపీఎల్ వేదికల జాబితాలో చేర్చలేదంటూ అజహర్ వివరణ ఇవ్వగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వయంగా స్పందించి బీసీసీఐ నుద్దేశించి ట్వీట్ చేశారు. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో కోవిడ్ వ్యాప్తి నియంత్రణలోనే వుందని ఆయన బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. అజహర్ వివరణలో మరిన్ని అంశాలను ప్రస్తావిస్తూ.. ఆర్థికపరమైన బకాయిలు, జరిమానాలు వంటి వాటిని సరి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. లేకపోతే గత కార్యవర్గాల నిర్వాకంతో హెచ్.సీ.ఏ. ఈపాటికే మూతపడి వుండేదని అజహర్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో యెండల లక్ష్మినారాయణ అజహర్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పాత కేసులను తవ్వుతున్నారు. 22 ఏళ్ళ నాటి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాన్ని తెరమీదికి తెస్తున్నారు. పునర్విచారణ చేస్తే అజహర్ దోషిత్వం నిరూపణ అవుతుందని అంటున్నారు. అదే సమయంలో కేసులుంటే వచ్చే హెచ్.సీ.ఏ. ఎన్నికల్లో అజహర్ పోటీకి దూరంగా వుండాల్సి వస్తుంది. ఈ క్రమంలో హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న వ్యవహారాలను తెరమీదికి తెచ్చేందుకు యెండల కంకణం కట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు.