Shreyas Iyer : అతని దూకుడే కొంపముంచిందా..ఆసియా కప్ నుండి అయ్యర్ ఔట్ ? మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు!
భారత జట్టు ఆసియా కప్‌కు ఎంపికైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ లేకపోవడం చర్చనీయాంశమైంది. 2024లో కేకేఆర్, ముంబై జట్లను ట్రోఫీలు గెలిపించిన అయ్యర్, 2025 ఐపీఎల్ సీజన్ లో 604 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. అయినా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

Shreyas Iyer : ఆసియా కప్‌కు టీమిండియాను సెలక్ట్ చేసిన తర్వాత దాంట్లో శ్రేయస్ అయ్యర్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. చివరిసారిగా 2023 నవంబర్‌లో టీ20 ఫార్మాట్‌లో ఆడిన అయ్యర్, ఆ తర్వాత తన అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో, బ్యాటింగ్‌లో నిలకడైన ప్రదర్శనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 30 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మూడవ ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా, 2024-25 దేశీయ సీజన్‌లో ముంబైని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిపాడు. 2025లో జరిగిన ఐపీఎల్‌లో అయ్యర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 17 మ్యాచ్‌లలో 175 స్ట్రైక్ రేట్‌తో 604 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్, వ్యూహాత్మక నాయకత్వం పంజాబ్ కింగ్స్‌ను 2014 తర్వాత రెండవసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేర్చాయి. అయినా, ఆసియా కప్ జట్టులో అయ్యర్‌కు స్థానం దక్కలేదు. కనీసం రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో కూడా లేకపోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
అయ్యర్ గురించి మణిందర్ సింగ్ వ్యాఖ్యలు
“ఒక ఆటగాడు మైదానంలో దూకుడుగా ఉంటే అది చెడు ప్రవర్తనగా మారనంత వరకు సమస్య కాదు. అతను మిమ్మల్ని చూసిన ప్రతిసారీ పలకరించకపోవచ్చు, కానీ బహుశా అతను ఆటపై దృష్టి పెట్టడం, వివిధ పరిస్థితుల్లో ఎలా ఆడాలని ఆలోచించడంలో నిమగ్నమై ఉండవచ్చు. అది ఒక గొప్ప అథ్లెట్ లక్షణం” అని మణిందర్ అన్నారు. అయ్యర్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన మణిందర్, 6-7 సంవత్సరాల క్రితమే తానూ అతడు భారత జట్టుకు తర్వాతి కెప్టెన్ కావాలని చెప్పానని గుర్తు చేసుకున్నారు. “ఇప్పుడు వారు అతన్ని సెలక్ట్ చేస్తారని నాకు నమ్మకం లేదు. భారత టీ20ఐ జట్టులో చోటు సంపాదించడానికి అతను ఇంకా ఏమి చేయాలి?.. నేను నమ్మకం కోల్పోయాను. కానీ అతను ఒక అద్భుతమైన ఆటగాడు, మంచి క్రికెటింగ్ మైండ్ ఉంది. అతను మన వైట్‌బాల్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఉండాలి” అని అన్నారు.
యశస్వి జైస్వాల్ ఎంపిక లేకపోవడంపై ఆశ్చర్యం
భారత ఆసియా కప్ జట్టులో మరో ముఖ్యమైన లోపం యశస్వి జైస్వాల్ లేకపోవడం. టెస్టులు, టీ20ఐలలో ఓపెనర్‌గా అతను ఇప్పటికే తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. జైస్వాల్ ఇప్పటివరకు 22 టీ20ఐ ఇన్నింగ్స్‌లలో 36.15 సగటుతో 723 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో కూడా జైస్వాల్ సభ్యుడే.
జైస్వాల్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు
“జైస్వాల్ జట్టులో లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అతను ఒక గొప్ప ఆటగాడు. అతను ఆటలో ఎంత పరిణతి సాధించాడో, ఎంత కష్టపడ్డాడో నేను చూశాను. అతను టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్‌లకు అద్భుతంగా అడ్జస్ట్ చేసుకుంటాడు. అలాంటి ఆటగాడి నుంచి ఆత్మవిశ్వాసాన్ని మనం ఎందుకు తీసేస్తున్నాం? ఇలా చేయడం ద్వారా ఒకరి కెరీర్‌ను నాశనం చేయవచ్చు. ఈ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు, కానీ ఇదే పరిస్థితిలో మరొకరు ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు” అని మణిందర్ అన్నారు.
శుభ్‌మన్ గిల్ టెస్టు కెప్టెన్సీపై అభిప్రాయాలు
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్ గురించి కూడా మణిందర్ సింగ్ మాట్లాడారు. గిల్ తన తొలి టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా పది ఇన్నింగ్స్‌లలో 75.4 సగటుతో 754 పరుగులు చేసి, నాలుగు సెంచరీలు సాధించాడు.
అయితే, ఐదు టెస్టుల సిరీస్‌లో రెండు జట్ల మధ్య తీవ్ర పోటీ జరగడంతో గిల్ నాయకత్వం పలుసార్లు పరీక్షకు గురైంది. “నిజాయితీగా చెప్పాలంటే, నేను కొద్దిగా నిరాశ చెందాను. అతని నుంచి నేను మరింత దూకుడు ఆశించాను. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు, అతను అంత యాక్టీవ్ గా లేడు. అతను పరిస్థితులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం లేదు. ఐదవ టెస్టులో అతను కొంచెం స్థిరపడినట్లు కనిపించాడు. అతనికి మంచి క్రికెటింగ్ మైండ్ ఉంది. భవిష్యత్తులో కెప్టెన్‌గా రాణించే కెపాసిటీ ఉంది. కానీ, అతను ఇతరుల చేత కంట్రోల్ కాకుండా, తనను తాను కంట్రోల్ లో ఉంచుకోవాలి” అని చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




