IND vs PAK: ఫాంలో లేవంటూ వద్దన్నారు.. కట్‌చేస్తే.. రీఎంట్రీలో పాక్‌కు ముచ్చెమటలు.. ఆ తుఫాన్ ఇన్నింగ్స్ ప్లేయర్ ఎవరంటే?
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఊహించిన రీతిలోనే శుభారంభం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఊహించిన రీతిలోనే శుభారంభం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు భారత్‌ను ఓడిస్తుందని అనిపించినా.. జెమీమా రోడ్రిగ్స్ ఒక ఎండ్‌లో నాటౌట్‌గా నిలిచి జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. జెమీమా ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించింది. అయితే, నాడు టీమ్‌కి స్టార్‌గా మారిన జెమీమా.. ఈ మ్యాచ్‌కు ముందు వరకు జట్టులో చోటు కోసం నానా కష్టాలు పడింది.
గతేడాది న్యూజిలాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో జెమీమాకు చోటు దక్కలేదు. అయినా పట్టు వదలని ఈ భారత ప్లేయర్.. కష్టపడి తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది. పాక్‌తో కీలక మ్యాచ్‌లో భారత్‌కు విజయాన్ని అందించింది. జూన్ 2022లో టీమిండియాకు తిరిగి వచ్చింది. శ్రీలంకపై 27 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేసింది. అప్పటి నుంచి ఆమె జట్టుకు కీలకంగా మారింది.
కీలక సమయంలో వీరోచిత ఇన్నింగ్స్..
టాస్ గెలిచిన పాక్ జట్టు భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యస్తిక్ భాటియా, షెఫాలీ వర్మ జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ కలిసి 38 పరుగులు జోడించారు. 17 పరుగులు చేసిన తర్వాత భాటియా ఔట్ కాగా ఆమె స్థానంలో జెమీమా వచ్చింది. షెఫాలీ 33, హర్మన్‌ప్రీత్ కౌర్ 16 పరుగుల వద్ద ఔటయ్యారు. ఈ సమయంలో భారత జట్టులో సంక్షోభం ఏర్పడింది. అయితే రిచా ఘోష్‌తో కలిసి జట్టును గెలిపించిన జెమీమా.. స్టార్‌గా నిలచింది. జెమీమా 38 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సహాయంతో అజేయంగా 53 పరుగులు చేసింది. అదే సమయంలో, రిచా 20 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 31 పరుగులతో అజేయంగా ఆడింది. వీరిద్దరూ 33 బంతుల్లో 58 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు.
తల్లిదండ్రులకు ధన్యవాదాలు..
జెమీమాకు ఈ ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే గత సంవత్సరం ఆమె ప్రపంచ కప్ ఆడలేకపోయింది. ఇప్పుడు తన అద్భుతమైన బ్యాటింగ్ ఆధారంగా ప్రపంచ కప్‌లో భారత్‌కు విజయవంతమైన ఆరంభాన్ని అందించింది. ఈ సమయంలో ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆమె తన ఇన్నింగ్స్‌ను తల్లిదండ్రులకు అంకితం చేసింది. మ్యాచ్ అనంతరం జెమీమా మాట్లాడుతూ.. ‘ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైనది. నేను కొన్ని రోజులుగా పరుగుల కోసం కష్టపడుతున్నాను. కానీ, నేను నా పట్టుదలను ఏమాత్రం వదులుకోలేను. ఈ ఇన్నింగ్స్‌ను నా తల్లిదండ్రులకు అంకితం చేయాలనుకుంటున్నాను. వారు స్టేడియంలోనే ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..