AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్ గుండెల్లో వైభవ్ సూర్యవంశీ భయం.. తొలి మ్యాచ్ హీరో జై మూంద్రా సంచలన వ్యాఖ్యలు

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జై మూంద్రా, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్ అతడి గురించే మాట్లాడుతోందని పేర్కొన్న మూంద్రా, రెండో టీ20లో వైభవ్‌కు అవకాశం లభిస్తే మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగలడని అభిప్రాయపడ్డాడు.

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్ గుండెల్లో వైభవ్ సూర్యవంశీ భయం.. తొలి మ్యాచ్ హీరో జై మూంద్రా సంచలన వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jun 28, 2026 | 12:33 PM

Share

Vaibhav Sooryavanshi : భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌ కంటే ముందే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ తరఫున అద్భుతంగా అరంగేట్రం చేసిన భారత సంతతి ఫాస్ట్ బౌలర్ జై మూంద్రా.. టీమిండియా 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన జై మూంద్రా వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైభవ్ బ్యాటింగ్ ప్రతిభను చూస్తుంటే ఐర్లాండ్ బౌలర్లలో ఒక రకమైన గుబులు మొదలైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

వైభవ్ సూర్యవంశీ గురించి జై మూంద్రా మాట్లాడుతూ, “క్రికెట్‌లో వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. అతను ఇప్పటికే భారత్ తరఫున ఆడే స్థాయికి వచ్చాడు, త్వరలోనే ఇంటర్నేషనల్ క్యాప్ కూడా అందుకుంటాడు. అతనిలో ఎంత అద్భుతమైన టాలెంట్ ఉందో మనమంతా చూశాం. అతను మైదానంలోకి వస్తే భారీ హిట్టింగ్‌తో ఎప్పుడైనా మ్యాచ్‌ను తిప్పేయగలడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మొత్తం అతని గురించే మాట్లాడుకుంటోంది. ఐర్లాండ్ ప్రజలు కూడా ఈ చిన్నవాడి బ్యాటింగ్ విధ్వంసాన్ని లైవ్‌గా చూడాలని ఆరాటపడుతున్నారు” అని చెప్పుకొచ్చారు.

రెండో టీ20లో వైభవ్‌కు అవకాశం దక్కేనా?

సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని అభిమానులంతా ఆశపడ్డారు, కానీ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో ఇప్పుడు సిరీస్ కాపాడుకోవాల్సిన కఠినమైన పరిస్థితి ఏర్పడింది. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను బరిలోకి దించుతాడా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ వైభవ్‌కు కనుక అవకాశం వస్తే, అతడిని అడ్డుకోవడం ఐర్లాండ్ బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది.

తొలి బంతికే వికెట్ తీసి మూంద్రా రికార్డ్

భారత్‌పై జరిగిన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ తరఫున ఆడిన జై మూంద్రా తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 25 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. విశేషం ఏంటంటే, అంతర్జాతీయ కెరీర్‌లో తాను వేసిన అత్యంత మొదటి బంతికే వికెట్ సాధించి జై మూంద్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతని అద్భుత బౌలింగ్ వల్లే ఐర్లాండ్ జట్టు టీమిండియాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయగలిగింది.

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us