ఐపీఎల్‌లో అత్యంత విలువైన జట్టు ఇదే.. తొలిసారి 2 బిలియన్ డాలర్ల మార్క్ దాటిన ఫ్రాంచైజీ..!
IPL Most Valuable Franchise: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) మరో అరుదైన ఘనత సాధించింది. ఫ్రాంచైజీ విలువలో ఐపీఎల్‌లోనే అగ్రస్థానంలో నిలిచిన ముంబయి.. తొలిసారిగా 2 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. స్పోర్టికో నివేదిక ప్రకారం ముంబయి ఇండియన్స్ విలువ సుమారు రూ.20 వేల కోట్లకు చేరింది. మిగిలిన ఫ్రాంచైజీల విలువలు కూడా భారీగా పెరిగాయి.

IPL Most Valuable Franchise: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కేవలం క్రికెట్ టోర్నమెంట్‌గానే కాకుండా ప్రపంచంలోని అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా ఎదుగుతోంది. తాజాగా ఫ్రాంచైజీల విలువలకు సంబంధించిన గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి. స్పోర్టికో నివేదిక ప్రకారం ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలిచింది.
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ విలువ 2.1 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.20 వేల కోట్లుగా నమోదైంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో 2 బిలియన్ డాలర్ల విలువను దాటిన తొలి ఫ్రాంచైజీగా ముంబయి నిలిచింది.
ముంబయి తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) 1.85 బిలియన్ డాలర్ల విలువతో రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 1.75 బిలియన్ డాలర్ల విలువతో మూడో స్థానంలో నిలిచింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) విలువ 1.73 బిలియన్ డాలర్లు కాగా.. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 1.7 బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) విలువ 1.65 బిలియన్ డాలర్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) విలువ 1.62 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 1.58 బిలియన్ డాలర్లు, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) 1.53 బిలియన్ డాలర్లు, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) 1.5 బిలియన్ డాలర్ల విలువతో టాప్-10లో ఉన్నాయి.
టాప్-10 ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ..
ముంబయి ఇండియన్స్ – $2.1 బిలియన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – $1.85 బిలియన్
చెన్నై సూపర్ కింగ్స్ – $1.75 బిలియన్
కోల్‌కతా నైట్‌రైడర్స్ – $1.73 బిలియన్
దిల్లీ క్యాపిటల్స్ – $1.70 బిలియన్
రాజస్థాన్ రాయల్స్ – $1.65 బిలియన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ – $1.62 బిలియన్
గుజరాత్ టైటాన్స్ – $1.58 బిలియన్
పంజాబ్ కింగ్స్ – $1.53 బిలియన్
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ – $1.50 బిలియన్
ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా వస్తుంది?
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రధాన ఆదాయ వనరుల్లో బీసీసీఐ సెంట్రల్ రెవెన్యూ పూల్ కీలకమైనది. ప్రసార హక్కులు, డిజిటల్ మీడియా హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో ఫ్రాంచైజీలకు వాటా లభిస్తుంది. స్పోర్టికో నివేదిక ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీకి బీసీసీఐ నుంచి ఏడాదికి సుమారు రూ.475 కోట్ల నుంచి రూ.520 కోట్ల వరకు నిధులు అందుతున్నాయి.
ఇవి కాకుండా మ్యాచ్ టికెట్ల విక్రయాలు, స్పాన్సర్‌షిప్స్, వాణిజ్య భాగస్వామ్యాలు, జెర్సీలు, ఇతర అధికారిక వస్తువుల విక్రయాలు కూడా ఫ్రాంచైజీల ఆదాయాన్ని పెంచుతున్నాయి.
2026 సీజన్‌లో ఒక్కో ఫ్రాంచైజీ సగటున సుమారు రూ.708 కోట్ల రెవెన్యూ సాధించినట్లు నివేదిక పేర్కొంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన సమయంలో ఉన్న విలువలతో పోలిస్తే.. ఫ్రాంచైజీల విలువ దాదాపు 1800 రెట్లు పెరిగినట్లు స్పోర్టికో నివేదికలో వెల్లడైంది.
ఐపీఎల్‌కు పెరుగుతున్న ప్రేక్షకాదరణ, భారీ మీడియా హక్కుల విలువ, స్పాన్సర్‌షిప్ మార్కెట్, డిజిటల్ వ్యూయర్‌షిప్ కారణంగా ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ కూడా వేగంగా పెరుగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
