AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027 : ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. హెడ్ కోచ్ హేమంగ్ బదానీపై వేటు.. మళ్లీ పగ్గాలు చేపట్టనున్న దాదా

IPL 2027 : ఐపీఎల్ 2027 ముందు ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మార్పులకు సిద్ధమవుతోంది. హేమంగ్ బదానీ స్థానంలో సౌరవ్ గంగూలీ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. యువరాజ్ సింగ్ ఎంట్రీ, రిషభ్ పంత్ రీటర్న్, కెప్టెన్సీ మార్పులతో ఢిల్లీ జట్టులో పూర్తి మేకోవర్ కనిపించనుంది.

IPL 2027 : ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. హెడ్ కోచ్ హేమంగ్ బదానీపై వేటు.. మళ్లీ పగ్గాలు చేపట్టనున్న దాదా
Delhi Capitals
Rakesh
|

Updated on: Jun 20, 2026 | 12:22 PM

Share

IPL 2027 : ఐపీఎల్ 2027 సీజన్ ముందే ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గత అక్టోబర్ 2024లో రికీ పాంటింగ్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన హేమంగ్ బదానీపై వేటు వేయడానికి ఫ్రాంచైజీ సిద్ధమైంది. బదానీ పర్యవేక్షణలో మెగా వేలంలో జట్టును నిర్మించినప్పటికీ, మైదానంలో ఢిల్లీ జట్టు స్థిరమైన ప్రదర్శన చేయలేకపోయింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన ఢిల్లీ.. తాజాగా ముగిసిన 2026 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 7 మాత్రమే గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. వరుసగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతో మేనేజ్‌మెంట్ కోచ్‌ను మార్చాలని నిర్ణయించింది.

మళ్లీ దాదా చేతికి ఢిల్లీ పగ్గాలు

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. హేమంగ్ బదానీని కోచ్ పదవి నుంచి తప్పించి, అతని స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీని హెడ్ ఆఫ్ క్రికెట్ అఫైర్స్ లేదా ముఖ్య కోచ్‌గా నియమించడానికి ఫ్రాంచైజీ చర్చలు జరుపుతోంది. గంగూలీకి ఈ ఫ్రాంచైజీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 2019లో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ డైరెక్టర్‌గా చేరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి టీ20 లీగ్స్ వ్యవహారాలను చూశారు. ఆ తర్వాత 2023లో నేరుగా ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు 2027 సీజన్ కోసం గంగూలీని పూర్తి స్థాయి బాధ్యతలతో జట్టులోకి తీసుకురావడం దాదాపు ఖాయమైంది.

యువరాజ్ సింగ్ ఎంట్రీ.. కంప్లీట్ మేకోవర్

ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం హెడ్ కోచ్‌ను మార్చడమే కాకుండా, సపోర్ట్ స్టాఫ్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. గంగూలీతో పాటు భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్‌ను కూడా కోచింగ్ ప్యానెల్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికతో జట్టులో సరికొత్త జోష్ వస్తుందని, యువ ఆటగాళ్లకు మంచి మార్గదర్శకత్వం లభిస్తుందని యాజమాన్యం నమ్ముతోంది. ఐపీఎల్ 2027 వేలానికి ముందే ఈ కొత్త కోచింగ్ టీమ్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కెప్టెన్సీ మార్పుపై తర్జనభర్జనలు

కోచింగ్ స్టాఫ్‌తో పాటు ఢిల్లీ జట్టు కెప్టెన్సీ విషయంలోనూ పెద్ద గందరగోళం నడుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను మార్చాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఐపీఎల్ 2025లో జట్టులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ ఆఫర్ చేసినప్పటికీ, అతను ఆ బాధ్యతలను స్వీకరించడానికి నిరాకరించినట్లు సమాచారం. రాహుల్ కేవలం బ్యాటర్‌గానే కొనసాగుతానని స్పష్టం చేయడంతో, ఇప్పుడు మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయ కెప్టెన్ కోసం వేట మొదలుపెట్టింది.

రిషభ్ పంత్ మెగా ట్రేడింగ్‌కు స్కెచ్

రాహుల్ నో చెప్పడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ తమ పాత కెప్టెన్ రిషభ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున ఆడుతున్న పంత్‌ను భారీ ట్రేడింగ్ ద్వారా ఢిల్లీకి తీసుకురావడానికి ఇరు ఫ్రాంచైజీల మధ్య ముసుగులో చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ ఈ మెగా ట్రేడ్ గనుక సక్సెస్ అయితే, అక్షర్ పటేల్ స్థానంలో రిషభ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. అదే జరిగితే, కొత్త కోచ్ గంగూలీ, కొత్త కెప్టెన్ పంత్ కాంబినేషన్‌లో ఢిల్లీ కొత్త సీజన్‌ బరిలోకి దిగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us