IPL 2026: ఐపీఎల్ హిస్టరీలోనే తోలిసారి ఇలా.. ఆ లిస్ట్‌లో హోరాహోరీ పోరు.. టాప్ లిస్ట్‌లో ఎవరున్నారంటే?
Orange Cap Leader: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. జట్ల మధ్య ప్లే ఆఫ్ పోరు ఎంత తీవ్రంగా ఉందో, వ్యక్తిగత రికార్డుల కోసం ఆటగాళ్ల మధ్య పోటీ కూడా అంతే ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ కోసం ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

Purple Cap Holder: ఈ ఏడాది బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన మొదటి ఐదుగురు బ్యాటర్లలో ముగ్గురు హైదరాబాద్ జట్టుకు చెందినవారే ఉండటం విశేషం. సన్‌రైజర్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 494 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 475 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. అదే జట్టుకు చెందిన ఇషాన్ కిషన్ 409 పరుగులతో నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం.
అవకాశం కోల్పోయిన కేఎల్ రాహుల్..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్న స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునే సువర్ణావకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అతను కేవలం 23 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. దీనివల్ల అతను 468 పరుగులతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 404 పరుగులతో ఐదో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
పర్పుల్ క్యాప్ రేసులో భువనేశ్వర్ హవా..
బౌలింగ్ విభాగంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ 17 వికెట్లతో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ కూడా 17 వికెట్లతో సమానంగా ఉన్నప్పటికీ, మెరుగైన ఎకానమీ రేటు కారణంగా భువనేశ్వర్ పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. లక్నో జట్టుకు చెందిన ప్రిన్స్ యాదవ్, గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబడా చెరో 16 వికెట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఢిల్లీ, కోల్‌కతా మధ్య జరిగిన తాజా మ్యాచ్ తర్వాత బౌలింగ్ పట్టికలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ కార్తీక్ త్యాగి రెండు వికెట్లు పడగొట్టి మొదటి పది మంది జాబితాలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం అతను 13 వికెట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. లీగ్ దశ ముగిసే సమయానికి ఈ జాబితాలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
