IPL 2023: మార్క్‌వుడ్ ‘పాంచ్‌’ పటాకా.. లక్నో చేతిలో ఢిల్లీ చిత్తు.. 50 పరుగుల తేడాతో వార్నర్‌ సేన ఓటమి

ఐపీఎల్‌-16 సీజన్‌లో కేఎల్‌ రాహుల్ సేన శుభారంభం చేసింది. శనివారం రాత్రి లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. 194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన..

IPL 2023: మార్క్‌వుడ్ 'పాంచ్‌' పటాకా.. లక్నో చేతిలో ఢిల్లీ చిత్తు.. 50 పరుగుల తేడాతో వార్నర్‌ సేన ఓటమి
Lsg Vs Dc
Follow us

|

Updated on: Apr 02, 2023 | 5:25 AM

ఐపీఎల్‌-16 సీజన్‌లో కేఎల్‌ రాహుల్ సేన శుభారంభం చేసింది. శనివారం రాత్రి లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. 194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని మార్క్‌వుడ్‌ (14/5) బెంబేలెత్తించాడు. పృథ్వీ షా, మిచెల్‌ మార్ష్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లను ఔట్‌ చేసిన మార్క్‌ వుడ్ ఆఖరిలో అక్షర్‌ పటేల్‌, చేతన్‌ సకారియాలను పెవిలియన్‌ పంపించాడు. రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌కూడా రాణించడంతో ఢిల్లీ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌ ( 56; 48 బంతుల్లో 7 ఫోర్లు) ఒక్కడే పోరాడాడు. రిలీ రోసోవ్ (30) ఫర్వాలేదనిపించాడు. సంచలన బౌలింగ్‌తో ఢిల్లీని కుప్పకూల్చిన మార్క్‌వుడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

మేయర్స్‌ మెరుపు బ్యాటింగ్‌..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ (73; 38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. నికోలస్‌ పూరన్‌ (36; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుష్‌ బదోని (18; 7 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడడంతో లక్నో భారీస్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీకి శుభారంభమే లభించింది. వార్నర్‌, పృథ్వీ షా దూకుడగా ఆడడంతో 4 ఓవర్లకు స్కోరు 40 పరుగులు చేసింది. అయితే ఐదో ఓవర్‌లో మార్క్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టి ఢిల్లీకి భారీ షాక్‌ ఇచ్చాడు. పృథ్వీ షా(12), మిచెల్‌ మార్ష్ (0) వరుస బంతుల్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు. కొద్దిసేపటికే సర్ఫరాజ్‌ఖాన్‌ (4)ని కూడా ఔట్‌ చేసి వార్నర్‌ సేనను కోలుకోనీయకుండా చేశాడు. వార్నర్‌, రిలీ రోసో నిలకడగా ఆడుతూ కొద్ది సేపు వికెట్ల వేటకు అడ్డువేశారు. అయితే రవి బిష్ణోయ్‌ రిలీ రోసోవ్‌ తో పాటు రోవ్‌మన్‌ పావెల్‌ (1)ని ఔట్‌ చేశాడు. ఇక 16 ఓవర్‌లో అవేశ్‌.. అమాన్‌ ఖాన్‌ (4)తో పాటు కెప్టెన్‌ వార్నర్‌ని పెవిలియన్‌కు పంపడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..