CSK vs KKR, IPL 2022: ఆరంభంలో అదరగొట్టేది ఎవరు.. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే, కేకేఆర్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఐపీఎల్ 2022 మొదటి మ్యాచ్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తొలిపోరు జరగనుంది. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.
క్రికెట్ పండుగ తిరిగి వచ్చింది. సిక్సర్,లు ఫోర్ల వర్షం మొదలుకానుంది. సత్తా చాటేందుకు యువకులు సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ 2022 (IPL 2022) ప్రారంభానికి ఇప్పుడు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (Chennai Super Kings vs Kolkata Knight Riders) తో తలపడనుంది. గత సీజన్‌లో ఇరు జట్లు ఫైనల్‌లో తలపడగా చెన్నై ఏకపక్షంగా నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇది గతానికి సంబంధించిన విషయం. ప్రస్తుత జట్లు, సారథిలో మార్పులు వచ్చాయి. చెన్నై, కోల్‌కతా (CSK vs KKR, IPL 2022) మధ్య గట్టి పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే రెండు జట్లు అద్భుతంగా కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఒత్తిడి పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేయడం వారికి తెలుసుననడంలో సందేహం లేదు.
మరోవైపు యువ ఆటగాళ్లతో కూడిన కోల్‌కతా జట్టు శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో రంగంలోకి దిగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఐపీఎల్‌లో జరగబోయే తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఎలా రాణించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి మ్యాచ్‌లో చెన్నై రికార్డులు..
చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పటికీ, మొదటి మ్యాచ్‌లో వారి రికార్డు ప్రత్యేకంగా ఏమీ లేదు. చెన్నై ఇప్పటి వరకు 12 సార్లు ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లు ఆడగా 6 గెలిచి 6 ఓడింది. అంటే చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు 50 శాతంగా ఉంది. మరోవైపు KKR 14 ఓపెనింగ్ మ్యాచ్‌లలో 10 గెలిచింది. అంటే మొదటి మ్యాచ్‌లో విజయం సాధించడంలో CSKపై KKR ముందుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి ఐదు మొదటి మ్యాచ్‌లలో 4 గెలిచింది. కేవలం ఒక మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోన్నారు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఈ ఓటమిని పొందింది. కాగా, ఐపీఎల్ 2022 తొలి మ్యాచ్ వాంఖడే వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.
తొలి మ్యాచ్‌లో కేకేఆర్ ప్రదర్శన..
KKR IPLలో ఇప్పటివరకు తమ 10 ఓపెనింగ్ మ్యాచ్‌లను గెలుచుకుంది. 2013 నుంచి 2019 వరకు వారు తమ మొదటి మ్యాచ్‌లను వరుసగా 7 సార్లు గెలుచుకుంది. 2020లో ముంబై ఇండియన్స్ చేతిలో 49 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాగా, ఇంతకు ముందు ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చెన్నై, కేకేఆర్ టీంలు ఒక్కసారి మాత్రమే ఢీకొన్నాయి. ఈ మ్యాచ్‌లో సీస్‌కే టీం 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ 2011లో చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.
Also Read: IPL 2022: CSK vs KKR మ్యాచ్ కోసం ‘రెడ్’ పిచ్ సిద్ధం.. వాంఖడే మైదానంలో రికార్డులు ఎలా ఉన్నాయంటే?