IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మినీ వేలానికి వేళాయె… ఈ స్టార్ ఆటగాళ్లకు మరోసారి కష్టమే.. ఛాన్స్ లేనట్లేనా.!
IPL 2021 Auction: మినీ ఆక్షన్ రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే జరగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు ఈ ఆక్షన్ లో...
IPL 2021 Auction: మినీ ఆక్షన్ రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే జరగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు ఈ ఆక్షన్ లో పాల్గొననున్నారు. ఈ లిస్టులో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో కేవలం ఇద్దరే ఇద్దరు దేశీ ఆటగాళ్లకు చోటు లభించగా.. ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి.
అలాగే రూ.1.5 బేస్‌ప్రైజ్ కేటగిరిలో 12 మందిని, రూ.కోటి కేటగిరిలో హనుమ విహారి, ఉమేశ్‌యాదవ్ సహా 11 మందిని చేర్చారు. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13, అత్యల్పంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పలు ఫ్రాంచైజీలు తమ టీమ్స్ లో భారీ మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. ఇంకొన్ని ఫ్రాంచైజీలు తుది కూర్పులో బలం చేకూర్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ ప్లేయర్స్ కు మళ్లీ నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. వారెవరో ఇప్పుడు చూద్దాం..
కేదార్ జాదవ్:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సీనియర్ ఆయిన ఈ ఆటగాడిని యాజమాన్యం మినీ వేలానికి ముందు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గతేడాది కేదార్ ఫామ్ లో లేకపోవడం చెన్నైకి పెద్ద మైనస్ అయింది. అంతేకాకుండా ఫ్రాంచైజీలు అందరూ కూడా భవిష్యత్తు సీజన్లను దృష్టి పెట్టుకుని ఆటగాళ్లను ఎంపిక చేస్తారు కాబట్టి.. కేదార్ కు ఈ ఏడాది నిరాశే మిగులుతుందని చెప్పాలి.
షెల్డన్ కాట్రెల్:
వెస్టిండీస్ జట్టులో మేటి పేస్ బౌలర్ అయిన కాట్రెల్.. ఐపీఎల్ లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. గతేడాది కూడా పంజాబ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది తక్కువే. అందుకే యాజమాన్యం మినీ వేలానికి ముందు ఇతడిని విడుదల చేసింది. కొన్నిసార్లు బ్యాట్స్ మెన్ ఇతడి అదనపు పేస్ ను పరుగుల కోసం ఉపయోగించుకోవచ్చు కూడా.
మొయిన్ అలీ:
ఆర్‌సిబి అలీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అతడి ఫామ్ స్థిరత్వం లేకపోవడం పెద్ద మైనస్. ఇక అదే కారణం వల్ల ఫ్రాంచైజీలు అలీని ఎంపిక చేసే అవకాశం ఉండకపోవచ్చు.
నాథన్ కౌల్టర్-నైల్:
ఈ ఆస్ట్రేలియా పేసర్ వేలంలో ఎంపిక కాకపోవచ్చు. గతేడాది గాయం కారణంగా చాలా మ్యాచ్ లు మిస్సయిన కౌల్టర్ నైల్.. చివరి మ్యాచ్ లలో ఆడాడు. అయితే ఆ గాయాల బెడదను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు ఇతగాడిపై ఆసక్తిని చూపించకపోవచ్చు .
లియామ్ ప్లంకెట్:
అంతర్జాతీయ క్రికెట్ కు పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఇంగ్లాండ్ పేసర్ లియామ్ ప్లంకెట్ ను ఈ వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 2019లో తన చివరి పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడిన ప్లంకెట్, కేవలం ఏడు ఐపీఎల్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన ఇతడు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కనబరచలేదు.
జాసన్ రాయ్:
ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ రాయ్ స్థానంలో డేనియల్ సామ్స్ ను జట్టులోకి తీసుకొచ్చింది. గత ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాయ్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. అటు గుజరాత్ లయన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన రాయ్.. ఈ మినీ వేలంలో రూ. 1.5 కోట్ల బేస్ ప్రైజ్ కు అందుబాటులో ఉన్నాడు. అయితే అతడి కంటే ఆరోన్ ఫించ్, డేవిడ్ మాలన్, మార్టిన్ గుప్టిల్, మాథ్యూ వేడ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్ వంటి ఆటగాళ్ళు చాలా తక్కువ ధరకు లభిస్తుండటంతో, రాయ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం లేదని కనిపిస్తోంది.
హర్భజన్ సింగ్:
ఐపీఎల్ చరిత్రలో హర్భజన్ సింగ్ కు కొన్ని పేజీలు ఉండటం ఖాయం. ఎందుకంటే ఈ లీగ్ అతనికి ఉన్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ వేలం ముందు రిలీజ్ చేసింది. రూ. 2 కోట్ల బేస్ ధరకు అందుబాటులో ఉన్న హర్భజన్ పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించే అవకాశం కనిపించట్లేదు. తక్కువ మొత్తంలోనే స్పిన్ విజార్డ్స్ లభ్యం కానుండటం దీనికి కారణం.