ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ పోరు.. 13 ఏళ్ల తర్వాత కోహ్లీ లేకుండానే బరిలోకి టీమిండియా.!
ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే తొలి టెస్ట్‌కు రోహిత్ సేన రెడీగా ఉంది. కోహ్లీ లేకపోయినా.. సిరీస్‌లో రాణిస్తామని కెప్టెన్ ధీమాగా ఉన్నారు. అటు రాచకొండ పోలీసులు కూడా మ్యాచ్ కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే తొలి టెస్ట్‌కు రోహిత్ సేన రెడీగా ఉంది. కోహ్లీ లేకపోయినా.. సిరీస్‌లో రాణిస్తామని కెప్టెన్ ధీమాగా ఉన్నారు. అటు రాచకొండ పోలీసులు కూడా మ్యాచ్ కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఈరోజు నుంచి హైదరాబాద్‌లో భారత్ vs ఇంగ్లండ్ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఉదయం 9.30 నుంచి మొదలయ్యే ఈ పోరుకు రెండు జట్లు సన్నద్ధమయ్యాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకపోవడం అటు భారత అభిమానులకే కాకుండా.. ఇటు హైదరాబాద్‌లో మ్యాచ్ చూడడానికి వచ్చే వారిని కూడా డిసప్పాయింట్ చేస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. అయితే రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమిండియా ఇంగ్లండ్‌ను మట్టికరిపించడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్ పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు కాకపోయినా.. తొలుత సీమర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి. భారత బౌలింగ్ ఎటాక్‌లో వరల్ట్ నెంబర్ 1 టెస్ట్ బౌలర్ అశ్విన్ ఉంటాడు. జడేజాకు చోటిస్తారు. అయితే మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. పేసర్లలో బుమ్రాతోపాటు లోకల్ బాయ్ మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తాడు. ఇక కోహ్లీ లేకపోవడంతో కేఎల్ రాహుల్‌ని ఆ స్ధానంలో దింపి.. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ కొనసాగుతూనే.. గిల్, అయ్యర్, రాహుల్, జడేజా, భరత్‌తో బ్యాటింగ్ లైనప్ ఉండే అవకాశాలున్నాయి. గిల్ తన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు. టెస్టుల్లో నిలదొక్కుకోడానికి ఈ సిరీస్ గిల్‌కు సువర్ణావకాశం. .
మరోవైపు ఇంగ్లండ్ టీమ్ కూడా స్పిన్నర్లతో రెడీగా ఉంది. ఇప్పటికే తొలి టెస్టు ఆడే జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. స్పిన్ విభాగంలో.. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీకి అవకాశం ఇచ్చింది జట్టు. వీరికి తోడు జో రూట్ కూడా స్పిన్‌తో రాణిస్తాడు. పేస్ బౌలింగ్‌లో మార్క్ వుడ్, బెన్‌స్టోక్స్ ఉన్నారు. భారత్ పిచ్‌లకు మూడో పేసర్ అక్కర్లేదన్న భావనతో.. వీరిద్దరితోనే టీమ్ బరిలోకి దిగుతోంది. ఇక బ్యాటింగ్ విభాగంలో.. జాక్‌క్రాలీ, బెన్ డకెట్, ఓలీపోప్, జో రూట్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్‌తో బలంగా ఉంది. బెన్ ఫోక్స్‌ని కీపర్‌గా బరిలోకి దించుతూ.. బెయిర్‌స్టోని బ్యాటింగ్ ఆప్షన్‌గా ఉంచింది ఇంగ్లండ్. భాతర్‌ను సొంతగడ్డపై చివరిసారిగా ఓడించిన జట్టు ఇంగ్లండే. అందుకే టీమిండియా కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్ ఇవ్వొద్దని ఇప్పటికే పకడ్బందీ వ్యూహాలు రచించారు. హైదరాబాద్ పిచ్ బ్యాటర్లకే అనుకూలిస్తుందన్న అంచనాలు ఉండడంతో.. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. రెండు జట్లూ చివరి ఐదు టెస్టుల్లో రెండు విజయాలు, రెండు పరాజయాలు, ఓ డ్రాతో ఉన్నాయి. మరి ఈ టెస్టులో నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే కాదు.. బౌలింగ్‌లో ఎవరు రాణిస్తారు అన్నదానిపైనే అవకాశాలు ఉన్నాయి.
కోహ్లీ లేని లోటు పూడ్చాలంటే.. ఆ స్థానంలో వచ్చే బ్యాటర్‌పైనే ఆధారపడి ఉంది. శ్రేయస్ అయ్యర్ స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడు కాని.. పేస్ బౌలింగ్‌ను ఎలా ఎటాక్ చేస్తాడనేది చూడాలి. రాహుల్ రాణిస్తున్నాడు. కాని భరత్ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. సొంతగడ్డపై భారత్ 12 ఏళ్ల నుంచి టెస్టు సిరీస్ ఓడలేదు. ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగించే అవకాశం ఉంది.
