AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: కొలంబో టెస్ట్‌లో అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. గ్లౌజులు విసిరికొట్టిన శ్రీలంక ప్లేయర్

IND vs SL: కొలంబో టెస్టులో మసక వెలుతురులో ఆట కొనసాగించడంపై శ్రీలంక ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంపైర్ నిర్ణయంతో ఆగ్రహించిన ప్రభాత్ జయసూర్య పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత గ్లౌజులు విసిరికొట్టాడు. అంతకుముందు ధ్రువ్ జురెల్ సెంచరీతో భారత్ 503/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, లంక 8/2తో కష్టాల్లో పడింది.

IND vs SL: కొలంబో టెస్ట్‌లో అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. గ్లౌజులు విసిరికొట్టిన శ్రీలంక ప్లేయర్
Ind Vs Sl
Rakesh
|

Updated on: Aug 25, 2026 | 9:45 AM

Share

IND vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తీవ్ర వివాదంతో ముగిసింది. మసక వెలుతురులో ఆట కొనసాగించడంపై లంక ఆటగాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆఖరి ఓవర్లలో లంక రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో, నిరాశతో పెవిలియన్‌కు చేరిన బ్యాటర్ ప్రభాత్ జయసూర్య డ్రెస్సింగ్ రూమ్‌లో గ్లౌజులు విసిరికొట్టి తన కోపాన్ని వెళ్లగక్కడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయంలో తీవ్ర వివాదం చెలరేగింది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత శ్రీలంక బ్యాటింగ్‌కు వచ్చింది. రోజు ముగియడానికి కొద్ది ఓవర్లే మిగిలి ఉండటం, ఆకాశం మబ్బుపట్టి వెలుతురు గణనీయంగా తగ్గిపోవడంతో లంక బ్యాటర్లు ఆటను నిలిపివేయాలని అంపైర్లను కోరారు. అంపైర్లు లైట్ మీటర్ ద్వారా వెలుతురును పరిశీలించినప్పటికీ ఆటను కొనసాగించడానికే మొగ్గు చూపారు. ఈ నిర్ణయం పట్ల శ్రీలంక ఆటగాళ్లు కమిల్ మిషారా, ప్రభాత్ జయసూర్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆఖరి బంతికి వికెట్.. పీక్స్‌కు చేరిన ఆగ్రహం

అంపైర్లు ఆట నిలిపివేయకపోవడంతో భారత బౌలర్లు పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతికి ఓపెనర్ లహిరు ఉదార (1) పెవిలియన్ బాట పట్టగా, రోజు ఆఖరి బంతికి మానవ్ సుతార్ బౌలింగ్‌లో ప్రభాత్ జయసూర్య (2) ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. పెవిలియన్‌కు వెళ్తున్నంత సేపూ జయసూర్య వెనక్కి తిరిగి అంపైర్ల వైపే అసహనంగా చూశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టగానే తన గ్లౌజులను విసిరికొట్టాడు. ఈ దృశ్యాలను చూసి లైవ్ కామెంట్రీలో ఉన్న సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ, జయసూర్య కోపంతో ఊగిపోతున్నాడని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Most Sixes: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏడుగురు విధ్వంసకర బ్యాటర్లు వీరే

ధ్రువ్ జురెల్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

ఈ వివాదానికి ముందు భారత్ మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) బాధ్యతాయుత శతకంతో చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించాడు. 177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో అలరించిన జురెల్‌కు రిషభ్ పంత్ (63) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వర్షం కారణంగా ముందుగానే టీ విరామం ప్రకటించినా, ఆ తర్వాత భారత్ ధీటుగా ఆడి 503 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఇది కూడా చదవండి: Video: బౌలింగ్ వేస్తున్నావా.. బుల్లెట్ పేలుస్తున్నావా? 153.6 KMPH స్పీడ్‌తో రెచ్చిపోయిన భారత బౌలర్

పోరాటంలో పడిన శ్రీలంక

రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. క్రీజులో కమిల్ మిషారా (5 నాటౌట్) ఉన్నాడు. భారత్ వేసిన భారీ స్కోరు కంటే శ్రీలంక ఇంకా 495 పరుగుల వెనుకంజలో ఉంది. అంపైర్ల నిర్ణయంపై వివాదం నడుస్తున్నప్పటికీ, మ్యాచ్‌పై భారత్ పూర్తి పట్టు సాధించింది. రెండో రోజు ముగింపులో జరిగిన ఈ డ్రామా కొలంబో టెస్టుకు మరింత వేడిని తెచ్చిపెట్టింది. అంపైర్ల నిర్ణయంపై లంక జట్టులో అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ, మూడో రోజు టీమిండియా బౌలర్లు లంకను ఎంత త్వరగా ఆలౌట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us