IND vs PAK: ఏషియన్ గేమ్స్‌కు ముందే భారత్, పాక్ హైవోల్టేజ్ పోరు.. షెడ్యూల్ లీక్, ఎక్కడంటే..?
India vs Pakistan Match: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక భావోద్వేగం. ఆగస్టు చివరి వారంలో ప్రారంభమయ్యే ఈ ఆసియా కప్ సమరంలో మన జట్టు మరోసారి జయభేరి మోగించి ఏషియన్ గేమ్స్‌కు ముందు శుభారంభం ఇస్తుందో లేదో చూడాలి.

India vs Pakistan Match: క్రికెట్ మైదానంలో ఇండియా, పాకిస్తాన్ తలాపడితే అభిమానులకు వచ్చే కిక్కే వేరు. ఈ దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. త్వరలో జరగబోయే ఏషియన్ గేమ్స్‌కు ముందే భారత్, పాకిస్తాన్ జట్లు మైదానంలో ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో క్రికెట్ వర్గాల్లో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది.
ఏషియన్ గేమ్స్ కన్నా ముందే దాయాదుల సమరం!
సాధారణంగా ఏషియన్ గేమ్స్ వేదికగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో భారత్, పాక్ జట్లు తలాపడతాయని అంతా భావించారు. అయితే అభిమానులకు అంతకంటే ముందే ఆ వేడుక అందుబాటులోకి రానుంది. ఏషియన్ గేమ్స్ ప్రారంభానికి ముందే మహిళల ఆసియా కప్ 2026 పోటీలు జరగనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, రాబోయే కొన్ని రోజుల్లోనే పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రసారకర్తలు, అభిమానుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని భారత్, పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచేందుకు నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనివల్ల నాకౌట్ దశ కంటే ముందే కనీసం ఒక మ్యాచ్ గ్యారెంటీగా లభిస్తుంది.
ఆగస్టు 28 నుంచే ఆసియా కప్ షురూ?
మహిళల ఆసియా కప్ ఈసారి టి20 ఫార్మాట్‌లో జరగనుంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ టోర్నమెంట్ ఆగస్టు 28 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. పాల్గొనే జట్లు ఆగస్టు 27 నాటికే వేదికకు చేరుకోవాలని ఏసీసీ అంతర్గత కమ్యూనికేషన్ ద్వారా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
వేదిక ఎంపికపై ఇంకా చర్చలు జరుగుతున్నప్పటికీ యూఏఈ వైపే మొగ్గు ఎక్కువగా ఉంది. పురుషుల క్రికెట్ లాగే మహిళల ఆసియా కప్‌లోనూ హై-వోల్టేజ్ డ్రామా, తీవ్రమైన ఉద్వేగాలు చోటుచేసుకుంటాయనడంలో సందేహం లేదు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి గెలవాలనే పట్టుదల రెండు జట్లలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
చరిత్రలో తిరుగులేని భారత్.. ఈసారీ కప్పు మనదేనా?
మహిళల ఆసియా కప్ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే భారత జట్టుదే పూర్తి ఆధిపత్యం. 2004లో ప్రారంభమైన ఈ టోర్నీలో తొలి నాలుగు ఎడిషన్లు వన్డే ఫార్మాట్‌లో జరిగాయి. ఆ నాలుగింటిలోనూ టీమిండియానే విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2012 నుంచి టి20 ఫార్మాట్‌కు మారగా, ఇప్పటివరకు ఐదుసార్లు ఈ రూపంలో టోర్నీ జరిగింది.
మొత్తంగా చూస్తే వన్డే, టి20 ఫార్మాట్లు కలిపి భారత మహిళల జట్టు ఏకంగా 7 సార్లు ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ గణాంకాలే భారత జట్టు ఎంతటి బలమైనదో స్పష్టం చేస్తున్నాయి. రాబోయే ఆసియా కప్‌లోనూ టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పాకిస్తాన్‌పై ఉన్న ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ మరోసారి కప్పు కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




