KL Rahul : నాలుగో రోజు భారీ స్కోర్ లక్ష్యంగా బరిలోకి టీంఇండియా.. ఆశలన్నీ కేఎల్ రాహుల్ మీదే
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 244 పరుగుల లీడ్‌లో ఉంది. నాలుగో రోజు కేఎల్ రాహుల్ ప్రదర్శన కీలకం కానుంది. ఎందుకంటే ఇంగ్లండ్‌కు 400+ పరుగుల టార్గెట్ అవసరం.

KL Rahul : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసింది. మొదటి రెండురోజులు భారత జట్టు ఆధిపత్యం చెలాయించినా.. మూడో రోజు మాత్రం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్లు అద్భుతమైన సెంచరీలు సాధించారు.భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 407 పరుగులు చేసింది. దీంతో టీమ్ ఇండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం టీం ఇండియా మొత్తం 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మూడో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా ఇంగ్లండ్‌కు ఎంత టార్గెట్ ఇస్తుందనే దాని మీద అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో, ఇంగ్లండ్ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 371 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేధించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక రన్ ఛేజ్‌ల రికార్డును పరిశీలిస్తే అది 378 పరుగులుగా ఉంది. 2022లో భారత్ తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ రికార్డును నెలకొల్పింది. ఆ మ్యాచ్‌లో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో.. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారీ స్కోర్ చేయాలి. అంటే ప్రత్యర్థి జట్టు అయిన ఇంగ్లండ్‌కు కనీసం 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం చాలా ముఖ్యం.
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇదివరకు జరిగిన అతిపెద్ద సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్‌లను ఓ సారి పరిశీలిస్తే.. 2022లో ఇంగ్లండ్ 378 పరుగులను భారత జట్టుతో ఆడినప్పుడు చేధించింది. దీని తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 282 పరుగుల లక్ష్యాన్ని 2023లో ఛేజ్ చేసింది. 1999లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మూడో హయ్యాస్ట్ 211లను ఛేదించింది.
అందరి దృష్టి కేఎల్ రాహుల్‌పైనే
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా ఇంగ్లండ్‌కు 400 లేదా అంతకంటే ఎక్కువ టార్గెట్ ఇవ్వాలంటే కేఎల్ రాహుల్ ప్రదర్శన చాలా కీలకం కానుంది. మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ బ్యాట్ నుంచి ఆశించిన పరుగులు రాలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి అతను 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. దీంతో టీం ఇండియా అత్యధిక స్కోర్ చేయాలంటే నాలుగో రోజు కచ్చితంగా గట్టిగానే ఆడాలి. తను ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడితేనే భారత్ భారీ టార్గెట్‌ను ఇంగ్లండ్ ముందు ఉంచగలదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..