India Vs Bangladesh: భారత్‌లో ఆడలేమంటూ బీసీబీ మొండిపట్టు..ఐసీసీ, బీసీసీఐ తీసుకునే సంచలన నిర్ణయం ఏంటి?
India Vs Bangladesh : బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని కోరినప్పటికీ, ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే ఐసీసీ ఛైర్మన్ జై షా షెడ్యూల్‌ను పునః పరిశీలించే సంకేతాలిచ్చారని వార్తలు వస్తున్నాయి.

India Vs Bangladesh: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారంతో మొదలైన వివాదం ఇప్పుడు రెండు దేశాల మధ్య చిచ్చు రేపుతోంది. ఇది కేవలం క్రీడలకు సంబంధించిన అంశంగా మిగలకుండా అంతర్జాతీయ దౌత్య సంబంధాల స్థాయికి చేరుకుంది. 2026 టీ20 వరల్డ్ కప్ వేదికగా భారత్ ఉండటంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? భారత్ పాత్ర ఏంటి? అనే విషయాలను ఈ 5 ముఖ్యమైన పాయింట్ల ద్వారా అర్థం చేసుకుందాం.
1. ఐసీసీ మౌనం – షెడ్యూల్ మారుతుందా?
బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని కోరినప్పటికీ, ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే ఐసీసీ ఛైర్మన్ జై షా షెడ్యూల్‌ను పునఃపరిశీలించే సంకేతాలిచ్చారని వార్తలు వస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఐసీసీ, బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య జరిగే కీలక సమావేశంలో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.
2. బీసీసీఐ పట్టు ఎంత వరకు?
ఈ వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించి స్టేడియంలు, భద్రత, హోటళ్లు, ప్రయాణ ఏర్పాట్లన్నీ బీసీసీఐ పర్యవేక్షిస్తోంది. చివరి నిమిషంలో మ్యాచ్‌లను వేరే దేశానికి తరలించడం వల్ల భారీగా ఆదాయం తగ్గడంతో పాటు ఏర్పాట్లన్నీ తలకిందులవుతాయి. అందుకే, షెడ్యూల్ మార్పు అంత సులభం కాదని చెప్పే పూర్తి అధికారం బీసీసీఐకి ఉంది.
3. భారత ప్రభుత్వం ఎందుకు కీలకం?
ఇది ఇప్పుడు కేవలం క్రికెట్ సమస్య కాదు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఐపీఎల్ 2026 టెలికాస్ట్‌పై నిషేధం విధించి తన కోపాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ మ్యాచ్‌ల తరలింపుపై నిర్ణయం తీసుకునే ముందు బీసీసీఐ ఖచ్చితంగా భారత ప్రభుత్వ సలహా తీసుకుంటుంది. ఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెళ్లడం వల్ల దౌత్యపరంగా కొంత సానుకూలత పెరిగింది. మరి క్రీడల విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.
4. ఐసీసీ చర్యలు తీసుకుంటుందా?
గతంలో భద్రతా కారణాలతో మ్యాచ్‌లు ఆడబోమని మొండికేసిన జట్లపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1996, 2003 వరల్డ్ కప్‌లలో మ్యాచ్‌లు ఆడని జట్లు పాయింట్లు కోల్పోయాయి. 2016 అండర్-19 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియాను ఏకంగా టోర్నీ నుంచే తప్పించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా పట్టుబడితే ఐసీసీ అదే తరహాలో శిక్ష విధిస్తుందా? లేక భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల లాగా ప్రత్యేక మినహాయింపు ఇస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
5. మిగిలిన జట్ల ఇబ్బందులు
ఒకవేళ బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు మారిస్తే, అదే గ్రూపులో ఉన్న మిగిలిన జట్లు భారత్, శ్రీలంక మధ్య పదే పదే ప్రయాణించాల్సి వస్తుంది. ఇది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే ఇతర క్రికెట్ బోర్డులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. మొత్తానికి బంగ్లాదేశ్ కోరిక తీర్చడం ఐసీసీకి అంత సులభం కాదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
