IND vs AFG 1st ODI : భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ తొలి వన్డే.. ధర్మశాలలో వరుణుడి ప్రతాపం.. టాస్ ఆలస్యం
IND vs AFG 1st ODI : భారత్-అఫ్గానిస్తాన్ తొలి వన్డేకు ధర్మశాలలో భారీ వర్షం అంతరాయం కలిగించింది. టాస్ ఆలస్యమవగా, విరాట్ కోహ్లీ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కోహ్లీ స్థానంలో మూడో నంబర్లో బ్యాటింగుకు ఇషాన్ కిషన్ వచ్చే అవకాశం ఉంది.

IND vs AFG 1st ODI : భారతదేశ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ మూడు వన్డేల సిరీస్ లోని మొదటి మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ సమయానికి భారీ వర్షం కురిసింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1:00 గంటకు టాస్ పడాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వాన కారణంగా టాస్‌ను అంపైర్లు తాత్కాలికంగా వాయిదా వేశారు. స్టేడియం మొత్తం నల్లటి మబ్బులతో చీకటిగా మారిపోవడంతో పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఇబ్బంది పడ్డ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సిరీస్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి తిరిగొచ్చాడు. అయితే 2027లో సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మకు 39 ఏళ్లు దాటుతాయి కాబట్టి, అతను అంతవరకు ఆడగలడా లేదా అనే సస్పెన్స్ నడుస్తోంది. ఈ క్రమంలో ఈ వన్డే సిరీస్ రోహిత్ ఫిట్‌నెస్‌కు ఎంతో కీలకం కానుంది. కానీ, మొదటి మ్యాచ్‌లోనే ఇలా వాన పడటంతో హిట్ మ్యాన్ రీఎంట్రీ కాస్త బ్రేక్ పడినట్లయింది.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కోహ్లీ లేకపోవడంతో భారత జట్టు మేనేజ్‌మెంట్ నెంబర్ 3 పొజిషన్‌లో ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపనుంది. విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆ కొత్త ప్లేయర్ ఎవరనేది టాస్ పడితే కానీ స్పష్టత రాదు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత్ ఘనవిజయం సాధించగా.. అదే ఊపును వన్డేల్లోనూ కొనసాగించాలని జట్టు భావిస్తోంది.
ఈ వన్డే సిరీస్ లో భారత మేనేజ్‌మెంట్ కేవలం సీనియర్ల ప్రదర్శనను మాత్రమే కాకుండా యువ ఆటగాళ్లను కూడా పరీక్షించనుంది. ముఖ్యంగా తరచూ గాయాల బారిన పడే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి ఈ సిరీస్ లో అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నారు. ఒకవేళ మ్యాచ్ సజావుగా సాగితే ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలకు చాలా ప్లస్ కానుంది.
మరోవైపు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పిచ్ పై తమకు గతంలో 2023 వరల్డ్ కప్ ఆడిన అనుభవం ఉందన్నారు. సాధారణంగా భారతీయ పిచ్‌లపై స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది కాబట్టి.. రషీద్ ఖాన్, యువ సంచలనం ఏఎమ్ గజన్‌ఫర్, సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీలతో కూడిన తమ స్పిన్ త్రయం టీమిండియాను కచ్చితంగా ఇబ్బంది పెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తాము ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నామని, ఇక్కడి నుంచే తమ వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ధర్మశాలలో ఈరోజు మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఉదయం పూట వర్షం పడే అవకాశం 96 శాతంగా ఉండగా, మధ్యాహ్నం వేళ అది 90 శాతంగా ఉంది. సాయంత్రానికి వాతావరణం కొద్దిగా సర్దుమణిగి వర్షం పడే సూచనలు 3 శాతానికి పడిపోయినప్పటికీ, రాత్రి వేళ మళ్లీ 65 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి మ్యాచ్ కనీసం ఓవర్లను తగ్గించి అయినా నిర్వహిస్తారా లేక పూర్తిగా రద్దు చేస్తారా అనేది వరుణ దేవుడి కరుణపైనే ఆధారపడి ఉంది.
మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
