IND vs SA 2nd T20: దక్షిణాఫ్రికాపై తొలిసారి సిరీస్ గెలిచే ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్ XIలో మార్పులుంటాయా?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం గౌహతిలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా రోహిత్ సేన స్వదేశంలో తొలిసారిగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను గెలుచుకోవాలని భావిస్తోంది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం, అక్టోబర్ 02న గౌహతిలో జరగనుంది. తొలి టీ20లో అదరగొట్టిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచి సౌతాఫ్రికాతో స్వదేశంలో తొలిసారి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే, భారత కెప్టెన్ విన్నింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితిలో సిరాజ్ బెంచ్ మీద కూర్చోవలసి ఉంటుంది.
అందరి దృష్టి ఈ ఆటగాళ్లపైనే..
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో టీ20లో చాలా మంది ఆటగాళ్లకు కీలకం కానుంది. వీరిలో భారత్‌కు చెందిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా ఉన్నారు. తొలి టీ20లో ఈ దిగ్గజాలు ఇద్దరూ పరుగులు చేయలేదు. అదే సమయంలో, దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రోస్సో, క్వింటన్ డి కాక్, కగిసో రబడా ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.
రెండో టీ20లో వర్షం విలన్‌గా మారే ఛాన్స్..
గౌహతిలో జరగనున్న రెండో టీ20లో వర్షం విలన్‌గా మారవచ్చని తెలుస్తోంది. గౌహతిలో పగటిపూట 6 శాతం వర్షం పడుతుందని, సాయంత్రం తర్వాత 40 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో, రోజంతా దట్టమైన మేఘాలు కమ్ముకోనున్నట్లు తెలుస్తోంది. గౌహతిలో సాయంత్రం 7 గంటలకు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉండటం అభిమానులకు చేదువార్తలా మారింది.
రెండు జట్లు-
భారత్ – రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్ మరియు మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా – టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), బ్జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జెన్సన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి న్గిడి, ఎన్రిక్ నార్ట్జే, వేన్ పార్నెల్, ఆండిల్ ఫెహ్లుక్ ప్రిటోరియస్, కగిసో రబడా, రిలే రోసోవ్, తబరెజ్ షమ్సీ మరియు ట్రిస్టన్ స్టబ్స్.