IND vs PAK: ఇండియా కొంపముంచినవి.. పాక్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే..

కలలో కూడా ఊహించని ఫలితం.. ఎంతో ఆశగా ఎదురుచూసిన భారత అభిమానులను ఓటమి వెక్కిరించింది. గత చరిత్రను తిరగరాస్తూ పటిష్ట భారత్‌ను పాక్ మట్టికరిపించింది.

IND vs PAK: ఇండియా కొంపముంచినవి.. పాక్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే..
Ind Vs Pak
Follow us

|

Updated on: Oct 25, 2021 | 3:09 PM

కలలో కూడా ఊహించని ఫలితం.. ఎంతో ఆశగా ఎదురుచూసిన భారత అభిమానులను ఓటమి వెక్కిరించింది. గత చరిత్రను తిరగరాస్తూ పటిష్ట భారత్‌ను పాక్ మట్టికరిపించింది. సాధారణంగా టాస్‌ ఎప్పుడూ కోహ్లీకి కలిసిరాదు. ఈ బిగ్ మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అయింది. ఇది టీమ్ ఫలితాన్ని శాసించింది. టాస్ గెలిచిన పాక్ సెకండ్ థాట్ లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్ కోహ్లీకి ఫేవర్ చేయలేదు. ఇక్కడే పాక్ సగం గెలిచింది. ఆరంభంలో పిచ్‌పై లభించిన స్వింగ్‌తో చెలరేగిన పాక్ బౌలర్లు.. అదే జోరును చివరి వరకు కొనసాగిస్తూ వరుసగా వికెట్లు తీశారు. క్రీజులో నిలదొక్కుకున్న పంత్, కోహ్లీ ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. వీళ్లిద్దర్నీ కీలక సమయాల్లో ఔట్ చేసిన పాక్.. తమ ఆధిపత్యాన్ని ఆఖరి వరకు కొనసాగిచింది. ఆ తర్వాత మంచు కురవడంతో భారత బౌలర్లకు బంతి పట్టు చిక్కలేదు. నిజానికి ఇప్పటిదాకా జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఛేజ్‌ చేసిన టీమే విక్టరీ కొట్టింది.

టీమిండియా ఓటమికి టాస్ ఓ రీజన్ అయితే.. టాపార్డర్‌ వైఫల్యం మరో కారణం. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ డకౌట్ అవ్వడం.. భారత్ కొంపముంచింది. బిగ్ వికెట్ కోల్పోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు పాకిస్థాన్ పట్టు బిగించేలా చేసింది. ఈ ఒత్తిడిని అధిగమించలేక అఫ్రిది వేసిన మరో ఓవర్లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య.. స్కోర్ బోర్డును పెంచే క్రమంలో వికెట్ పారేసుకున్నాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ వైఫల్యాన్ని అందిపుచ్చుకున్న పాక్ బౌలర్లు.. రెట్టించిన ఉత్సాహంతో బంతులు విసిరారు. రోహిత్ డకౌట్ కాకుంటే.. రాహుల్‌తో కలిసి కనీసం పవర్ ప్లే ముగిసే వరకు ఆడి మంచి శుభారంభం అందించి ఉంటే భారత్ భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉండేది. కానీ పాక్ బౌలర్ల స్వింగ్‌తో సీన్ మొత్తం రివర్స్ అయింది.

టాప్-3 విఫలమైనా.. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ పోరాడే లక్ష్యాన్నే పాక్ ముందు ఉంచింది. కానీ భారత బౌలర్లు ఆకట్టుకునే బౌలింగ్ చేయలేకపోయారు. భువీ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే రిజ్వాన్ సిక్స్, ఫోర్ బాదాడు. ఆ తర్వాత షమీ కూడా బౌండరీలు ఇవ్వడంతో పాక్ ఓపెనర్లకు పట్టు చిక్కింది. అశ్విన్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగాడు. 4ఓవర్లు వేసి 33 పరుగులిచ్చాడు. ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అశ్విన్ బరిలోకి దిగి ఉంటే కథ వేరేలా ఉండేది. ఫామ్‌లో లేని భువనేశ్వర్‌ను శార్దూల్ స్థానంలో తీసుకోవడం టీమిండియాకు మైనస్ అయింది. శార్దూల్ అటు బ్యాట్‌తో.. ఇటు బంతి‌తో ఇప్పటికే చాలా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ప్లేయర్‌ని పక్కనపెట్టడం కూడా ఓటమిపై ప్రభావం చూపించింది.

152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ స్మార్ట్‌గా బ్యాటింగ్ చేశారు. దుబాయ్ పరిస్థితులను అద్భుతంగా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశారు. వారి ఇన్నింగ్స్ చాలా నీట్‌గా కొనసాగింది. ఓపికగా ఆడుతూనే బౌలర్లపై విరుచుకుపడ్డారు. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఎలాంటి తప్పిదాలు చేయకుండా.. ప్రశాంతంగా బ్యాటింగ్ చేశారు. ఆతృత కనబర్చకుండా.. పేలవ షాట్లకు పోకుండా సింపుల్‌గా మ్యాచ్‌ను ముగించారు. ఫైనల్‌గా తమ ప్రణాళికలను పర్పెక్ట్‌గా అమలు చేసింది పాకిస్తాన్‌.

పాక్ గెలుపులో ఆ జట్టు ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ భాగస్వామ్యం కీ రోల్ పోషించింది. టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్తాన్ మొత్తం కోచింగ్ స్టాఫ్ మార్చింది. హెడ్ కోచ్‌గా సక్లైన్ ముస్తాక్, బ్యాటింగ్ కోచ్‌గా మాథ్యూ హేడెన్, బౌలింగ్ కోచ్‌గా వెర్నాన్ ఫిలాండర్‌కు బాధ్యతలు అప్పగించింది. అలాగే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా మారిన తర్వాత బాబర్ ఆజామ్.. తన ఆట స్టయిల్‌ పూర్తిగా మార్చుకున్నాడు. కూల్ కెప్టెన్సీతో పాక్‌కు విజయాలు అందించడమే కాకుండా.. కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అటు షాహీన్ అఫ్రిదిని బాబర్ ఆజామ్ ప్రత్యర్ధులపై ఓ అస్త్రంలా ఉపయోగిస్తున్నాడు. సరైన సమయాల్లో వికెట్లు తీస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఓపెనర్ రిజ్వాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మిడిల్ ఆర్డర్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా.. కావల్సినంత స్కోర్‌ను అందిస్తూ.. రన్‌రేట్‌ను పరుగులు పెట్టించాడు. మొత్తానికి టీమిండియాకు ఆ నలుగురు కొంపముంచితే.. పాకిస్తాన్‌కు ఆ నలుగురు విజయాన్ని అందించారు.

భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఫ్యాన్స్ ఎమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి. మ్యాచ్ గెలిచినా ఓడినా వారి రియాక్షన్ ను తట్టుకోవడం ఎవరి వల్లా కాదు. ఇంతటి బిగ్ మ్యాచ్ లో అంపైర్లు తప్పిదాలు వివాదాస్పదంగా మారాయి. కెఎల్ రాహుల్ ఔటైన బంతి నో బాల్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ వారి ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. ఈ ఫోటోలలో షహీన్.. నో బాల్ వేసినట్టు స్పష్టంగా ఉంది. ఆ తర్వాత బాబర్ అజమ్‌ రన్‌ అవుట్‌ని అంపైర్లు నాటౌట్‌ అని ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాట్‌ క్రీజులో ఉండగానే బంతి వికెట్లను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. కానీ అంపైర్లు మాత్రం ఔటివ్వలేదు. ఈ తప్పిదాలు కూడా భారత్ ఓటమిపై ప్రభావం చూపించాయి. స్పాట్..

మెంటార్‌గా ఉన్న మాస్టర్ మైండ్‌ ధోనీ ఏం చేశాడు..? కోహ్లీకి ఎలాంటి సలహాలు ఇచ్చాడు..? వాటిని గ్రౌండ్‌లో అమలు చేశారా? లేదంటే కోహ్లీ సొంత నిర్ణయాలు తీసుకున్నాడా? అన్న చర్చ కూడా నడుస్తోంది. మ్యాచ్ మధ్యలో ఇషాన్‌ కిషన్‌, శార్దూల్ ఠాకూర్‌లు వాటర్‌ బాటిల్స్‌తో వచ్చారు. కనీసం అప్పుడైనా గేమ్ ఛేంజ్‌ అవుతుందని భావించారంతా కానీ అలాంటి అద్భుతాలేవీ కనిపించలేదు. పాక్ ముందు మనవాళ్లు తేలిపోయారు. ఎలాంటి ప్రణాళికలు అమలు చేసే ఛాన్స్‌ కూడా పాక్ ఇచ్చినట్టు కనిపించలేదు.

సండే సమరంలో టీమిండియాకు ఏదీ కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఆటగాళ్లంతా డిసాప్పాయింట్‌లో కనిపించారు. అసలు ఓడిపోవడానికే వచ్చామన్నట్టుగా వాళ్ల మూడ్ కనిపించింది. ఈ మ్యాచ్‌తో పాకిస్తాన్ గత రికార్డులను తిరగరాసి టీమిండియాపై పైచేయి సాధించింది.

Also Read:  ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ’.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్