IND vs ENG : ఇంగ్లాండ్ గడ్డ.. కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్!
IND vs ENG : ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించి ఇంగ్లాండ్ గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సేనా దేశాల్లో 100 వన్డేలు ఆడిన అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు.

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయిన విరాట్ కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడనే దానిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ, మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే కోహ్లీ తన సత్తా చాటాడు. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి నాలుగు బంతులను డిఫెన్స్ ఆడిన కోహ్లీ, ఐదో బంతికి క్లాసిక్ ఫోర్ బాదాడు. ఈ ఒక్క ఫోర్‌తో ఖాతా తెరవడమే కాకుండా, ఇంగ్లాండ్ గడ్డపై భారత క్రికెట్ చరిత్రలోనే ఒక పెద్ద రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో కొట్టిన మొదటి ఫోర్‌తో విరాట్ కోహ్లీ.. టీమిండియా మాజీ కెప్టెన్, ది వాల్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న సుదీర్ఘకాలపు రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రాహుల్ ద్రవిడ్ రికార్డుల్లో ఉండేవాడు. ద్రవిడ్ ఇంగ్లాండ్‌లో 56 ఇన్నింగ్స్‌లలో 55 సగటుతో 8 సెంచరీల సాయంతో 2645 పరుగులు చేశాడు. ఇప్పుడు కోహ్లీ తన 75వ ఇన్నింగ్స్‌లో 40కి పైగా సగటుతో ఆ మైలురాయిని దాటి ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు 3 సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 56 ఇన్నింగ్స్‌లలో 2626 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఈ ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ తన కెరీర్‌లోని ఒక పాత మరకను కూడా చెరిపేసుకున్నాడు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే కార్డిఫ్ మైదానంలో ఇంగ్లాండ్‌తో తలపడినప్పుడు కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆ పిచ్‌పై కనీసం ఖాతా కూడా తెరవకుండా వెనుదిరిగిన కోహ్లీ, ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఆడుతూ ఐదో బంతికే ఫోర్ కొట్టి ఆ పాత జ్ఞాపకాలను తుడిచిపెట్టేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ టాస్ వేసిన వెంటనే కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాల్లో కలిపి వంద వన్డే మ్యాచ్‌లు ఆడిన అరుదైన మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు. ఇంగ్లాండ్‌లో కోహ్లీకి ఇది 35వ వన్డే మ్యాచ్ కావడం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
