Video: వేలంలో కోట్లు పోసి కొన్న ఆర్‌సీబీ.. కట్‌చేస్తే.. హీరో కాస్త జీరోగా మారాడేంటి భయ్యా..

IND vs ENG 3rd T20I: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. RCB ఈ ఆటగాడిని కొనుగోలు చేసినప్పటి నుంచి పరుగులు చేయడంలో కష్టపడుతున్నాడు. ఈ ఆటగాడు గత 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 1 అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు.

Video: వేలంలో కోట్లు పోసి కొన్న ఆర్‌సీబీ.. కట్‌చేస్తే.. హీరో కాస్త జీరోగా మారాడేంటి భయ్యా..
Phil Salt Ind Vs Eng

Updated on: Jan 28, 2025 | 9:04 PM

IPL 2025: ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ నుంచి ఎలాంటి ప్రత్యేక ప్రదర్శన కనిపించలేదు. ఇంగ్లండ్ జట్టు సిరీస్‌లో 0-2తో వెనుకబడి ఉంది. అదే సమయంలో, ఈ జట్టులో IPL 2025 మెగా వేలంలో కోట్ల రూపాయలు వెచ్చించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసిన ఆటగాడు కూడా ఉన్నాడు. కానీ, ఈ ఆటగాడు RCBలో భాగమైనప్పటి నుంచి ఆడటం మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఈ ఆటగాడు తన తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. అయితే, ప్రస్తుతం అతను ఒక్కో పరుగు కోసం కష్టపడుతున్నాడు.

RCBకి రాగానే పరుగుల కోసం కష్టపడుతోన్న ఫిల్ సాల్ట్..

ఐపీఎల్ 2025 మెగా వేలంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంగ్లాండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్‌పై చాలా డబ్బు ఖర్చు చేసింది. ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఫిల్ సాల్ట్‌పై ఆసక్తి కనబరిచాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతనిని రూ.11.50 కోట్లు చెల్లించి తమ జట్టులో చేర్చుకుంది. అయితే, ఫిల్ సాల్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగమైనప్పటి నుంచి అతను 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును దాటడంలో సఫలమయ్యాడు.

ఇవి కూడా చదవండి

టీమిండియాతో జరిగిన ఈ సిరీస్‌లో ఫిల్ సాల్ట్ తొలి 3 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 3 బంతులు మాత్రమే ఆడగలిగి ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అదే సమయంలో, రెండో మ్యాచ్‌లోనూ అతను 3 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు రాజ్‌కోట్‌లో కూడా అలాంటిదే కనిపించింది. 7 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

గత 11 ఇన్నింగ్స్‌లలో 10 విఫలం..

ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత, ఫిల్ సాల్ట్ మొత్తం 11 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 8 మ్యాచ్‌ల్లో రెండంకెల స్కోరును కూడా అందుకోలేక రెండుసార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కాగా, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అతను 43 నాటౌట్, 13 పరుగులు, 71 నాటౌట్‌తో ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను అబుదాబి టీ10, ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో కూడా ఆడాడు. మరోవైపు, ఐపీఎల్ చివరి సీజన్‌లో ఫిల్ సాల్ట్ 12 మ్యాచ్‌ల్లో 435 పరుగులు చేశాడు. ఈ పటిష్ట ఆటతీరును చూసిన RCB అతడిని కొనుగోలు చేసింది. అయితే, అతని పేలవమైన ఫామ్ ప్రస్తుతం RCBకి పెద్ద టెన్షన్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..