AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs IND : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. భారత్-ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్ సమయం మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే

ENG vs IND : భారత్-ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్ సమయం మారింది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగే ఈ పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది. సిరీస్‌లో నిలవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. టాస్ రాత్రి 9:30 గంటలకు జరుగుతుంది.

ENG vs IND : క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. భారత్-ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్ సమయం మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే
IND vs ENG
Rakesh
|

Updated on: Jul 05, 2026 | 8:05 PM

Share

ENG vs IND : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరగబోయే మూడో టీ20 మ్యాచ్ సమయం మారింది. రెండో టీ20 మ్యాచ్ ఇంగ్లాండ్‌లో పగటిపూట జరగడం వల్ల భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకే ప్రారంభమైంది. కానీ నోటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగబోయే మూడో మ్యాచ్‌ను డే-నైట్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. ఈ కారణంగా మ్యాచ్ సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జులై 7న జరగబోయే ఈ కీలక పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి 10:00 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే మ్యాచ్‌కు సంబంధించిన టాస్ రాత్రి 9:30 గంటలకు వేయనున్నారు. రాత్రి 7 గంటలకే మ్యాచ్ అనుకుని టీవీల ముందు కూర్చునే అభిమానులు ఈ కొత్త సమయాన్ని గమనించాల్సి ఉంటుంది.

ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో నిలవాలంటే భారత జట్టుకు ఈ మూడో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రద్దు కాగా, ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒకవేళ మూడో మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోతే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాలు దాదాపు చేజారిపోతాయి. అందుకే ఒక రోజు విరామం తర్వాత బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.

ఈ సిరీస్ టీమిండియా ఆ తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఒక పెద్ద సవాల్‌గా మారింది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయ్యర్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. ఆయన నాయకత్వంలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదు. మొదట ఐర్లాండ్ పర్యటనలో భారత్ 2-0తో సిరీస్ ఓడిపోగా, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షార్పణం, రెండో మ్యాచ్‌లో ఓటమి ఎదురయ్యాయి. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరగబోయే ఈ మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. అటు సిరీస్ సమం అవ్వడమే కాకుండా, కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే మొదటి అంతర్జాతీయ విజయం అవుతుంది.

అభిషేక్, సంజూ, వైభవ్‌లపైనే భారత్ ఆశలు

రెండో టీ20లో ఓటమి ఎదురైనప్పటికీ, భారత జట్టులో పుంజుకునే సత్తా ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో యంగ్ సంచలనం అభిషేక్ శర్మ, సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్, గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో భారత బౌలర్లు చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ చేజారింది. ఈ లోపాలను సరిదిద్దుకుని బౌలింగ్ విభాగం కూడా రాణిస్తే ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్‌పై భారత్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిరీస్ కీలక దశకు చేరడంతో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కోసం భారత పూర్తి స్క్వాడ్ వివరాలు

ఈ జట్టులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్జ్ ఉన్నారు. గత మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి వైభవ్‌కు అవకాశం ఇచ్చారు. అయితే మూడో టీ20లో గెలుపు ముఖ్యం కాబట్టి తుది జట్టులో ఎలాంటి మార్పులు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us