INDW vs SAW: మ్యాచ్‌లో ఊహించని ట్విస్ట్.. షెఫాలీ వర్మకు బౌలింగ్ ఇవ్వడానికి అసలు కారణం ఇదే..
Women’s World Cup 2025 Final: తొలిసారి మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. మ్యాచ్ తర్వాత, ఆమె జట్టు భవిష్యత్తు గురించే కాదు.. మ్యాచ్‌లో కీలకంగా మారిన షెఫాలీ బౌలింగ్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.

Women’s World Cup 2025: హృదయ విదారక స్థితి నుంచి చరిత్ర లిఖించే వరకు.. భారత మహిళా క్రికెట్ కీర్తి పతాకం వైపు తన సుదీర్ఘమైన, అసంపూర్ణ ప్రయాణాన్ని పూర్తి చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో, టీమిండియా దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. టైటిల్ గెలిచిన తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. మ్యాచ్ తర్వాత, షఫాలీ వర్మను బౌలింగ్ చేయడం గురించి ఆమె కీలక విషయం వెల్లడించింది.
భారత కెప్టెన్ ఏం చెప్పిందంటే..?
టైటిల్ గెలిచిన తర్వాత, టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, “ఇది ప్రారంభం మాత్రమే. ఈ అడ్డంకిని అధిగమించాలని మేం కోరుకున్నాం. దీన్ని అలవాటుగా మార్చుకోవడమే మా తదుపరి ప్రణాళిక. దీని కోసం మేం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. భారీ అవకాశాలు వస్తున్నాయి. మేం నిరంతరం మెరుగుపడాలని కోరుకుంటున్నాం. ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం మాత్రమే” అంటూ చెప్పుకొచ్చింది.
షఫాలీ వర్మకు బంతిని ఇవ్వడం గురించి అడిగిన ప్రశ్నకు భారత కెప్టెన్ మాట్లాడుతూ “లారా, సునే నెమ్మదిగా స్కోరును పెంచుతున్నప్పుడు, షఫాలీ అక్కడ నిలబడి ఉండటం నేను చూశాను. ఆమె బాగా బ్యాటింగ్ చేసింది. నా మనస్సాక్షి మాట వినాలని నాకు అనిపించింది. నేను ఆమెకు కనీసం ఒక ఓవర్ ఇవ్వాలని నా హృదయం చెబుతోంది. అది మాకు కీలక మలుపుగా మారింది. చివరికి, దక్షిణాఫ్రికా జట్టు కొంచెం భయపడింది. అక్కడే మేం ప్రయోజనం పొందాం. దీప్తి సరైన సమయంలో వచ్చి వికెట్లు తీసింది” అంటూ తెలిపింది.
అమోల్ మజుందార్‌పై ప్రశంసలు..
షఫాలీ వర్మ తన అంతర్జాతీయ వన్డే కెరీర్ మొత్తంలో 14 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసింది. కానీ, ఫైనల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసింది. రెండు కీలకమైన వికెట్లు తీసింది. షఫాలీ జట్టులోకి వచ్చినప్పుడు, మ్యాచ్‌లో ఆమె 2-3 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుందని మేం చెప్పామని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. అప్పుడు ఆమె, “మీరు నాకు బంతి ఇస్తే, నేను 10 ఓవర్లు బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను” అంటూ సమాధానం చెప్పిందంట. చివరకు ఫైనల్ మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌తోనూ కాదు, బౌలింగ్‌తోనూ సత్తా చూపి భారత జట్టు తన 47 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించింది.
జట్టు కోచ్ అమోల్ ముజుందార్ గురించి భారత కెప్టెన్ మాట్లాడుతూ, “అమోల్ సర్ జట్టుతోనే ఉన్నాడు. ఈ సందర్భానికి ప్రత్యేకంగా ఏదైనా చేయాలని, సిద్ధం కావాలని ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రోత్సహించేవాడు. సహాయక సిబ్బందికి, బీసీసీఐకి మనం క్రెడిట్ ఇవ్వాలి. మేం మా జట్టులో కీలక మార్పులు చేయలేదు. మాపై పూర్తి నమ్మకం ఉంచారు. అందరికీ ధన్యవాదాలు మేం ఈ రోజు ఇక్కడ ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చింది.




