Ravindra Jadeja : 15 ఏళ్ల తర్వాత పుట్టింటికి రాక్ స్టార్.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో తన తొలి అడుగు వేసిన ఫ్రాంచైజీలోకి దాదాపు 15 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఐపీఎల్ 2026లో జడేజా మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జెర్సీని ధరించబోతున్నాడు. ఈ రీఎంట్రీ జడేజాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అతనికి రాక్‌స్టార్ అనే పేరు దక్కింది ఈ జట్టులోనే.

Ravindra Jadeja : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో తన తొలి అడుగు వేసిన ఫ్రాంచైజీలోకి దాదాపు 15 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఐపీఎల్ 2026లో జడేజా మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జెర్సీని ధరించబోతున్నాడు. ఈ రీఎంట్రీ జడేజాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అతనికి రాక్‌స్టార్ అనే పేరు దక్కింది ఈ జట్టులోనే. ఈ వార్త రాజస్థాన్ రాయల్స్ అభిమానుల్లో పెద్ద ఉత్సాహాన్ని నింపి, రాబోయే ఐపీఎల్ సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
రాజస్థాన్ రాయల్స్‌లోకి తిరిగి రావడంపై రవీంద్ర జడేజా భావోద్వేగంతో మాట్లాడాడు. తాను కెరీర్ ప్రారంభించిన చోటుకే తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. “పదిహేను సంవత్సరాల తర్వాత నేను రాజస్థాన్‌కు తిరిగి వచ్చాను. నా ప్రయాణం ఎక్కడ మొదలైందో, రాక్‌స్టార్ అనే పేరు నాకు ఎక్కడ వచ్చిందో, అక్కడికి తిరిగి రావడం చాలా బాగుంది. మళ్లీ అదే చోటుకి తిరిగి వచ్చినందుకు డబుల్ హ్యాపీగా ఉంది” అని జడేజా చెప్పాడు.
తన కెరీర్‌లో ప్రస్తుత దశలో తాను ఆటను ఆస్వాదించడానికి, పోటీని ఆస్వాదించడానికి ప్రాధాన్యత ఇస్తున్నానని జడేజా చెప్పాడు. “ఎవరైతే నన్ను ప్రేమతో, మనస్ఫూర్తిగా, గౌరవంతో పిలుస్తారో అది నాకు ఎప్పుడూ నచ్చుతుంది” అని అన్నాడు. జడేజా తన యువకుడిగా ఉన్నప్పటి నుంచీ తన కెరీర్‌ను మలిచిన ఆస్ట్రేలియా దిగ్గజం, దివంగత షేన్ వార్న్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. వార్న్ కెప్టెన్సీలోనే జడేజా ఆర్ఆర్ తరఫున ఆడాడు.
తాను యువ ఆటగాడిగా ఉన్నప్పుడు ఐపీఎల్ ప్రాముఖ్యత గురించి పెద్దగా తెలియకపోయినా, వార్న్ తనను ప్రేమగా స్వాగతించారని జడేజా చెప్పాడు. “వార్న్ నన్ను చాలా ప్రోత్సహించాడు, రాక్‌స్టార్ అనే ముద్దుపేరు ఇచ్చాడు. నీకు సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ ఉంటుంది” అని అప్పుడే భరోసా ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలో మైదానానికి వెళ్లడం, ప్రాక్టీస్ చేయడం, నేర్చుకోవడం పట్ల తనకు ఎంత ఉత్సాహం ఉండేదో, అదే శక్తిని ఇప్పుడూ అనుభవిస్తున్నానని జడేజా పంచుకున్నాడు.
Home is where the journey began, home is at Rajasthan for @imjadeja 💗
घर वापसी, streaming on @StarSportsIndia and @JioHotstar at 1.30 PM | Nov 22 🏠💗 pic.twitter.com/95kaXEFb7W
— Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2025
ఆర్ఆర్ నుంచి వెళ్ళిపోయినా, విదేశీ సిరీస్‌లలో కలుసుకున్నప్పుడల్లా వార్న్ తనను ప్రోత్సహించేవారని, తనపై వార్న్ ప్రభావం తన కెరీర్‌ను మలచడంలో కీలకమని జడేజా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కొత్తగా వస్తున్న బ్యాటింగ్ టాలెంట్ వైభవ్ సూర్యవంశి గురించి కూడా జడేజా మాట్లాడాడు. యువకుడిగా అతను పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు చేశాడు. “వైభవ్ ఇప్పుడు చాలా చిన్నవాడు. అతనికి నా స్ఫూర్తి చాలా సింపుల్. కష్టపడి పని చేయి, నీ లక్ష్యాలను సాధించు, క్రికెట్ పట్ల నీకున్న అభిరుచిని అనుసరించు. నువ్వు దానిని సరిగ్గా కొనసాగిస్తే, నీకు మంచి వేదిక లభిస్తుంది. నీ ప్రయాణం త్వరలోనే మొదలవుతుంది” అని జడేజా సలహా ఇచ్చాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
