గౌతమ్ గంభీర్ ఓ విలన్.. తొక్కిపడేయడమే ఆయన నైజం: ఫాఫ్ డు ప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శైలిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ క్రమశిక్షణ గల కోచ్ అని కొనియాడుతూనే ఆయనను క్రికెట్ కథల్లోని అసలైన విలన్ గా అభివర్ణించాడు. గంభీర్ కు ఎవరి గౌరవం లేదా స్నేహం అవసరం లేదని కేవలం విజయం మాత్రమే కావాలని డు ప్లెసిస్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గౌతమ్ గంభీర్ ఓ విలన్.. తొక్కిపడేయడమే ఆయన నైజం: ఫాఫ్ డు ప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు
Goutam Gambhir

Updated on: Mar 27, 2026 | 10:45 AM

Faf Du Plessis Interview: జియో స్టార్ తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫాఫ్ డు ప్లెసిస్ భారత కోచ్ గౌతమ్ గంభీర్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గంభీర్ రాకతో భారత జట్టు ప్రదర్శన మరింత మెరుగైందని ఆయన అన్నారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ తీసుకొచ్చిన క్రమశిక్షణ, ఉన్నత ప్రమాణాలు జట్టును శిఖరాగ్రానికి తీసుకెళ్లాయని డు ప్లెసిస్ అభిప్రాయపడ్డారు.

“గౌతమ్ గంభీర్ ప్రతి క్రికెట్ కథలోనూ అసలైన విలన్ లాంటి వాడు. ఆయనకు మీ గౌరవం అక్కర్లేదు. మీ స్నేహం అస్సలు వద్దు. ఆయనకు తెలిసిందిల్లా ప్రత్యర్థులపై విజయం సాధించడం మాత్రమే” అని డు ప్లెసిస్ వ్యాఖ్యానించారు. గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ లో అత్యంత బలమైన జట్టుగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు.

విజయాల వెనుక గంభీర్ ముద్ర..

గౌతమ్ గంభీర్ కెరీర్ ను పరిశీలిస్తే ఆయన ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ విజయం వెన్నంటే ఉంటుంది. కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా రెండుసార్లు టైటిల్ అందించడమే కాకుండా 2024 లో మెంటర్ గా కూడా ట్రోఫీని గెలిపించారు. భారత జట్టు కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచకప్ 2026 వంటి మెగా టోర్నీలను భారత్ కైవసం చేసుకోవడంలో గంభీర్ వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి.

మరోవైపు ఫాఫ్ డు ప్లెసిస్ కెరీర్ విషయానికి వస్తే ఆయన దక్షిణాఫ్రికా తరపున 69 టెస్టుల్లో 4163 పరుగులు 143 వన్డేల్లో 5507 పరుగులు సాధించారు. ఐపీఎల్ లోనూ 154 మ్యాచ్ లు ఆడి 4773 పరుగులతో అత్యుత్తమ రికార్డును కలిగి ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆయనను తిరిగి అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్ వంటి కఠినమైన కోచ్ ఉన్నప్పుడు భారత జట్టును ఓడించడం ఎవరికైనా సవాలేనని డు ప్లెసిస్ మాటల ద్వారా స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us