AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs PAKW: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్ జట్టుకు భారీ జరిమానా.. ఎందుకంటే?

Pakistan Women Cricket Team Fined: భారత్ చేతిలో ఘోర ఓటమితో టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ప్రయాణం తీవ్రమైన ఒత్తిడిలో పడింది. అటు మైదానంలో పరుగుల పరంగా వెనుకబడటమే కాకుండా, ఇటు క్రమశిక్షణా రాహిత్యంతో ఐసీసీ జరిమానాకు గురికావడం పాక్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా పాక్ మహిళల జట్టు లయ అందుకుంటుందో లేదో చూడాలి.

INDW vs PAKW: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్ జట్టుకు భారీ జరిమానా.. ఎందుకంటే?
Indw Vs Pakw
Venkata Chari
|

Updated on: Jun 16, 2026 | 10:00 PM

Share

మహిళా టీ20 ప్రపంచకప్‌లో సాంప్రదాయ ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో గట్టి షాక్ ఇచ్చింది. మైదానంలో ఎదురైన పరాభవంతో కృంగిపోయిన పాక్ జట్టుకు, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధిస్తూ జరిమానా విధించింది.

భారత్ చేతిలో పరాభవం.. పాక్‌కు ఐసీసీ షాక్

మహిళా టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక పోరులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 64 పరుగుల తేడాతో ఘోర విజయాన్ని అందుకుంది. ఈ ఓటమి బాధ నుంచి పాకిస్తాన్ జట్టు తేరుకోకముందే, ఐసీసీ ఆ జట్టుకు డబుల్ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు (స్లో ఓవర్ రేట్) పాక్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

అసలేం జరిగిందంటే..?

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగగా, చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 34 పరుగులు) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి జట్టుకు కొండంత స్కోరును అందించింది.

అనంతరం 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు, భారత స్పిన్ మాయాజాలానికి విలవిల్లాడింది. ఒక దశలో 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన పాక్, ఆ తర్వాత భారత బౌలర్ దీప్తి శర్మ (5/10) కెరీర్ బెస్ట్ స్పెల్ ధాటికి పేకమేడలా కూలిపోయింది. కేవలం 17 ఓవర్లలోనే 106 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

నిబంధనలు ఏం చెప్తున్నాయి?

మ్యాచ్ ముగిసిన అనంతరం ఐసీసీ మ్యాచ్ రెఫరీ ట్రూడీ ఆండర్సన్ నేతృత్వంలోని బృందం పాక్ జట్టు నిర్ణీత సమయం కంటే ఒక ఓవర్ వెనుకబడినట్లు గుర్తించింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఒక జట్టు నిర్ణీత సమయంలోగా బౌలింగ్ పూర్తి చేయలేకపోతే, వెనుకబడిన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి 5 శాతం చొప్పున జరిమానా విధిస్తారు. పాక్ జట్టు ఒక ఓవర్ ఆలస్యంగా వేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌కు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించిన క్లైర్ పొలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్, థర్డ్ అంపైర్ ఎలోయిస్ షెరిడాన్, ఫోర్త్ అంపైర్ సూ రెడ్‌ఫెర్న్ ఈ స్లో ఓవర్ రేట్ ఫిర్యాదును నమోదు చేశారు. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా తన తప్పును అంగీకరించి, ఐసీసీ ప్రతిపాదించిన జరిమానాను స్వీకరించడంతో ఈ వ్యవహారంలో ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే ముగిసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us