Eoin Morgan Retirement: 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) సంచలన నిర్ణయం తీసుకోనున్నాడా? త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్నేళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతోన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇంగ్లిష్ మీడియా పత్రికలు నివేదిస్తున్నాయి. ఇండియాతో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ పగ్గాలతో పాటు ఆటగాడిగా కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉన్న మోర్గాన్ టీ20లతో పాటు వన్డేల్లో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ కారణంగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని ఈ 36 ఏళ్ల క్రికెటర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. జులై మొదటి వారంలో అతను తన నిర్ణయం వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.
మోర్గాన్ వారసుడు ఎవరంటే..
కాగా ఇటీవల ముగిసిన నెదర్లాండ్స్ వన్డే సిరీస్ లోనూ ఘోరంగా విఫలమయ్యాడీ స్టార్ ప్లేయర్. వరుసగా రెండు మ్యాచులలో డకౌట్ అయ్యాడు. మూడో మ్యాచ్ లో గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఒకవేళ మోర్గాన్ వీడ్కోలు పలికితే ఇంగ్లాండ్ వన్డే, టీ20 జట్లకు తదుపరి కెప్టెన్‌గా ప్రస్తుత వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ తో పాటు మొయిన్ అలీల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఇటీవల అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వర్షం కురిపిస్తోన్న బట్లర్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపనున్నారు. ఇక ఇంగ్లండ్ తరఫున 248 వన్డేలు ఆడిన మోర్గాన్.. 7,701 పరుగులు చేశాడు. 114 టీ20ల్లో 2,458 రన్స్ చేశాడు. 16 టెస్టులు కూడా ఆడాడు. ఇక ఐపీఎల్ లో మోర్గాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ కు సారథ్యం వహించాడు. అయితే ఈ ఏడాది వేలంలో అతను అమ్ముడుపోలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..