Kane Williamson: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో ఓటమిపాలైన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కొవిడ్ బారిన పడడంతో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) రెండో టెస్టుకు దూరమయ్యాడు. రెండో మ్యాచ్ ఆరంభానికి ముందు శుక్రవారం నిర్వహించిన రాపిడ్ యాంటీజెన్ టెస్టులో కేన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐదు రోజుల పాటు విలియమ్సన్ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. కాగా సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన కీలక మ్యాచుకు ముందు కెప్టెన్ కరోనా బారిన పడటం కివీస్ జట్టులో ఆందోళనలు రేపింది. కేన్ తప్పుకోవడంతో.. అతని స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. విలియమ్సన్ స్థానంలో హమీష్ రూథర్‌ఫర్డ్ జట్టుతో చేరనున్నాడు. కీలక మ్యాచ్‌లకు ముందు కేన్ కరోనా (Corona Virus) బారిన పడడం బాధగా ఉంది. అవసరమైన సమయంలో జట్టుకు దూరమవ్వడాన్ని కేన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు ఎంతగా నిరాశ చెందుతున్నాడో మా అందరికీ తెలుసు. జట్టులోని మిగతా సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాం. అందరికీ నెగెటివ్‌గా వచ్చింది. విలియమ్సన్ స్థానంలో రూథర్‌ఫర్డ్ జట్టులోకి వస్తాడు. అతనిపై మాకు నమ్మకం ఉంది. రెండో టెస్ట్ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం’ అని కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు.
కాగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ నిమిత్తం కివీస్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది.లార్డ్స్ వేదికగా ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఈ టెస్ట్‌లో కేన్ విలియమ్సన్ పెద్దగా పరుగులేమీ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్‌లో రెండు, రెండో ఇన్నింగ్‌లో 15 పరుగులు మాత్రమే చేశాడు. కాగా శాంతించిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ముందే సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఐడెన్ మర్క్‌రమ్ కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: