
క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతోంది టీమిండియా. జూన్ 20 నుంచి ఇంగ్లండ్- భారత జట్ల మధ్య టెస్ట్ సమరం ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించినప్పటి నుండి, లీడ్స్‌లో జరిగే తొలి టెస్ట్‌లో భారత్ ఎలా ఆడుతుందనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇటీవల, కొంతమంది భారతీయ స్టార్లు ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడారు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండవ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. ఆ తరువాత రెండవ ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు చేశాడు. దీంతో ఓపెనర్‌గా అతనే బరిలోకి దిగవచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మొదటి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అంచనా వేశాడు.
యశస్వి జైస్వాల్ తో పాటు కెఎల్ రాహుల్ ను కూడా ఓపెనర్లుగా పంపాలని రాబిన్ ఉతప్ప ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను కోరారు. గౌతమ్ గంభీర్ సన్నిహితులలో ఒకరైన ఉతప్ప స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ‘ నేను ప్రారంభంలోనే అత్యుత్తమంగా ఆడాలనుకుంటున్నాను. కెఎల్ రాహుల్ అక్కడ ఓపెనర్ గా ఆడాలని కోరుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో అతను బ్యాటింగ్ చేసిన విధానం, ఇటీవల ఇంగ్లాండ్ లో ఆడిన తీరు విధానాన్ని పరిశీలిస్తే, టీమిండియా అతన్ని ఓపెనర్ గా ఆడించాలి. ఇక 3వ స్థానంలో సాయి సుదర్శన్ లాంటి ఆటగాడిని చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతను సాంకేతికంగా చాలా మంచి బ్యాటర్. ఆ ప్లేస్ లో ఎలా ఆడాలో అతనికి బాగా తెలుసు. శుభ్‌మాన్ గిల్ ఖచ్చితంగా 4వ స్థానంలో ఉంటాడు. కరుణ్ నాయర్ 5వ స్థానంలో వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ స్థానంలో ఆడటానికి కొంత అనుభవం అవసరం’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.
ఇక టీమిండియా జట్టులో రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా, రవీంద్ర జడేజాను ఏకైక స్పిన్నర్‌గా కూడా ఎంచుకున్నాడు ఉతప్ప. ‘రిషబ్ పంత్ 6వ స్థానంలో ఆడాలి. ఇది అతని అత్యుత్తమ స్థానం అని నేను భావిస్తున్నాను. నేను నితీష్ కుమార్ రెడ్డికి 7వ స్థానాన్ని ఇస్తాను. అతను మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కాబట్టి, నాలుగో ఫాస్ట్ బౌలర్ గా కూడా ఉపయోగపడతాడు. జడేజాను ప్లేయింగ్ స్క్వాడ్‌లో చేర్చుకుంటే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అతను గతంలో ఇంగ్లాండ్‌లో భారీగా పరుగులు చేశాడు. కాబట్టి నేను అతన్ని 8వ స్థానంలో ఆడితే బాగుంటుంది.ఇక ఫాస్ట్ బౌలింగ్‌లో ఉతప్ప జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలను తీసుకుంటాను’ అని రాబిన్ పేర్కొన్నాడు. అయితే అతను కుల్దీప్ యాదవ్ కు జట్టులో స్థానం కల్పించలేదు.
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..