Vaibhav Suryavanshi : తొందరపడకండి.. వైభవ్ సూర్యవంశీని జాగ్రత్తగా చూసుకోండి.. వెస్టిండీస్ లెజెండ్ వార్నింగ్
Vaibhav Suryavanshi : వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ వైభవ్ విషయంలో ఒక కీలక సూచన చేశాడు. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా కూడా చాలా చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అప్పట్లో విండీస్ మేనేజ్మెంట్ లారాను నేరుగా మ్యాచ్‌ల్లోకి దించలేదు.

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదిన ఈ బుడ్డోడి విధ్వంసానికి సాక్షాత్తు ప్యాట్ కమిన్స్ కూడా ఫిదా అయిపోయాడు. తన ఫేవరెట్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీనే అంటూ కమిన్స్ కితాబిచ్చాడంటే ఈ కుర్రాడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతటి సంచలన ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలా? వద్దా? అనే దానిపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది.
వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ వైభవ్ విషయంలో ఒక కీలక సూచన చేశాడు. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా కూడా చాలా చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అప్పట్లో విండీస్ మేనేజ్మెంట్ లారాను నేరుగా మ్యాచ్‌ల్లోకి దించలేదు. వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాల మధ్య డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి, అంతర్జాతీయ స్థాయి వాతావరణంపై అవగాహన కల్పించారు. ఆ తర్వాతే అతడిని బరిలోకి దింపారు. వైభవ్ విషయంలో కూడా టీమిండియా ఇదే లారా ఫార్ములాను వాడాలని బ్రాత్‌వైట్ కోరుతున్నాడు.
వైభవ్‌ను ఇప్పుడే ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ సిరీస్‌లకు సెలక్ట్ చేయవద్దని బ్రాత్‌వైట్ అభిప్రాయపడ్డాడు. అతడిని నేరుగా మైదానంలోకి వదిలేయడం కంటే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్లతో గడిపే అవకాశం కల్పించాలని చెప్పాడు. సీనియర్ల దగ్గర ఆటకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నాక, మానసికంగా రెడీ అయ్యాకే అరంగేట్రం చేయిస్తే వైభవ్ కెరీర్ సుదీర్ఘంగా సాగుతుందని సూచించాడు. తొందరపడి లోతైన నీళ్లలోకి నెట్టేయకండంటూ బీసీసీఐకి క్లారిటీ ఇచ్చాడు.
కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 1.8 బిలియన్ల జనాభా ఉన్న భారత్‌లో ఇలాంటి ఒక 15 ఏళ్ల అద్భుత ఆటగాడు బయటకు రావడం ఐపీఎల్ గొప్పతనమే అని బ్రాత్‌వైట్ కొనియాడాడు. 37 ఏళ్ల వయసున్న తనకు.. వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే తాను ఇంకా ఎంతో నేర్చుకోవాలని అనిపిస్తోందని సరదాగా వ్యాఖ్యానించాడు.
వైభవ్ సూర్యవంశీకి ప్రపంచం ఇప్పుడు దాసోహమంటోంది. భారీ ఆర్థిక రివార్డులు, గొప్ప పేరు అతడి కోసం వేచి చూస్తున్నాయి. అయితే, ఈ స్టార్‌డమ్‌ను తట్టుకుని నిలబడాలంటే అతడిని సరైన పద్ధతిలో గైడ్ చేయాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ కుర్రాడిని ఎప్పుడు జాతీయ జట్టులోకి తీసుకుంటుందో అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బ్రాత్‌వైట్ చెప్పినట్లు లారా ప్లాన్ అమలు చేస్తే, వైభవ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక ధృవతారగా మిగిలిపోవడం ఖాయం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
