Devdutt Padikkal: శ్రీలంకలో చారిత్రక సెంచరీ.. విరాట్ కోహ్లీ సరసన దేవదత్ పడిక్కల్
Devdutt Padikkal: శ్రీలంకతో రెండో టెస్టులో దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగారు. 117 పరుగులతో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సమం చేశారు. శ్రీలంక గడ్డపై రెండు టెస్టు సెంచరీలు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో చేరారు. నంబర్-3లో వరుసగా రెండు విదేశీ టెస్టుల్లో సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు.

Devdutt Padikkal: శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యంగ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆయన 117 రన్స్ చేసి క్లాసిక్ సెంచరీతో ఆకట్టుకున్నారు. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులోనూ సెంచరీ బాదిన పడిక్కల్, ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సమం చేశారు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో పడిక్కల్ 168 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 117 రన్స్ చేసి అవుట్ అయ్యారు. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో రెండు సెంచరీలు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో ఆయన చేరారు. గతంలో విరాట్ కోహ్లీ శ్రీలంకలో తన టెస్టు కెరీర్‌లో రెండు సెంచరీలు చేయగా, ఇప్పుడు పడిక్కల్ ఆయన సరసన నిలిచారు. వీరిద్దరితో పాటు వినోద్ కాంబ్లీ, మహమ్మద్ అజహరుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అజింక్య రహానే కూడా శ్రీలంకలో రెండేసి సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 5 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు.
ఏడేళ్ల తర్వాత అరుదైన ఘనత
విదేశీ గడ్డపై నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా పడిక్కల్ రికార్డు సృష్టించారు. సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో ఛెతేశ్వర్ పుజారా నంబర్-3 లో వచ్చి వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు బాదారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పడిక్కల్ ఆ ఘనత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
కెప్టెన్ గిల్‌తో విలువైన భాగస్వామ్యం
ఓపెనర్లు త్వరగానే అవుట్ అయినప్పటికీ, పడిక్కల్ ఎంతో సంయమనంతో ఆడారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 120 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. లంక బౌలర్ల వ్యూహాలను తిప్పికొడుతూ మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్లతో అలరించారు. పడిక్కల్ ఇచ్చిన ఈ బలమైన పునాదితో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు వైపు పయనిస్తోంది.
తొలిరోజు టీమిండియా 300 రన్స్
రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 300 రన్స్ చేసింది. పడిక్కల్ సెంచరీతో మెరవగా, కెప్టెన్ గిల్ 50 రన్స్ చేశారు. యశస్వి జైస్వాల్ 45 రన్స్, రవీంద్ర జడేజా 43 రన్స్ చేసి తమవంతు పాత్ర పోషించారు. కేఎల్ రాహుల్ 18 రన్స్‌కు అవుట్ అవ్వగా, రిషభ్ పంత్ 3 రన్స్ వద్ద గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగారు. రోజు ముగిసే సమయానికి ధ్రువ్ జురెల్ (07), సారాంశ జైన్ (04) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో అసిథ ఫెర్నాండో మూడు వికెట్లు తీశారు.
