AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant Birthday : అండర్-19 వరల్డ్ కప్‌లో విధ్వంసం..ఐపీఎల్ వేలంలో కోట్ల వర్షం.. 18 ఏళ్లకే సంచలనం సృష్టించిన పంత్!

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ ఆరంభం గురించి ఒక ఆసక్తికరమైన కథనం. 2016 ఫిబ్రవరి 6న బంగ్లాదేశ్‌లోని ఫతుల్లాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో నమీబియాపై 111 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పంత్ భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు.

Rishabh Pant Birthday : అండర్-19 వరల్డ్ కప్‌లో విధ్వంసం..ఐపీఎల్ వేలంలో కోట్ల వర్షం.. 18 ఏళ్లకే సంచలనం సృష్టించిన పంత్!
Rishabh Pant (1)
Rakesh
|

Updated on: Oct 04, 2025 | 6:28 AM

Share

Rishabh Pant Birthday : దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం ఒకే రోజులో రెండుసార్లు సంచలనం సృష్టించినప్పుడు రిషబ్ పంత్ పేరు మొదటిసారి భారత క్రికెట్ వర్గాల్లో మారుమోగింది. అది 2016 ఫిబ్రవరి 6వ తేదీ. బంగ్లాదేశ్‌లోని ఫతుల్లాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో నమీబియాపై 111 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. అదే సమయంలో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ 2016 సీజన్ వేలంలో అతనిపై కోట్ల వర్షం కురిసింది. 18 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించిన ఈ ఆటగాడు, నేడు అక్టోబర్ 4న తన 28వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతని కెరీర్ పునాది ఢిల్లీలోని ఒక గురుద్వారాలో పడిందని చాలా తక్కువ మందికి తెలుసు.

2017లో భారత జట్టులో స్థానం సంపాదించుకున్న రిషబ్ పంత్, 1997 అక్టోబర్ 4న ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో జన్మించారు. అయితే అతని క్రికెట్ కెరీర్ పునాది ఢిల్లీలో పడింది. పంత్ కఠోర శ్రమ, అతని కుటుంబం ధైర్యం, కోచ్ తారక్ సిన్హా మార్గదర్శకత్వం, ఒక ప్రసిద్ధ గురుద్వారా అతని కెరీర్‌లో పెద్ద పాత్ర పోషించాయి. పంత్ తన కెరీర్‌ను ప్రారంభించిన సమయంలో ఎంఎస్ ధోనీ భారత క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా వెలుగొందుతున్నాడు. ధోనీలాగే పంత్ కూడా వికెట్ కీపర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. ధోనీలాగే చిన్న పట్టణం నుండి రావడం అతనికి ఒక సవాలుగా మారింది.

ఆ సమయంలో ఉత్తరాఖండ్‌లో క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి వ్యవస్థీకృత సంఘాలు లేదా స్టేట్ టీమ్స్ కూడా లేవు. దీంతో చిన్నారి రిషబ్‌ను అతని కుటుంబం ఢిల్లీకి పంపించి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. రిషబ్ అప్పుడు కేవలం 12 ఏళ్లవాడు. అతను ప్రతి రాత్రి బస్సులో ఢిల్లీకి ప్రయాణించేవాడు. అతని తల్లి సరోజ్ పంత్ తన చిన్నారి కొడుకును ప్రముఖ సోనెట్ క్రికెట్ క్లబ్ కోచ్ తారక్ సిన్హా పర్యవేక్షణలో క్రికెట్ నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఢిల్లీకి తీసుకెళ్లేది.

పంత్ కుటుంబానికి ఢిల్లీలో బంధువులు ఎవరూ లేరు. ఆర్థికంగా కూడా అంతగా సంపన్నం కాకపోవడం వల్ల ఎప్పుడూ హోటల్స్‌లో ఉండటం సాధ్యం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో, సౌత్ ఢిల్లీలోని ప్రసిద్ధ గురుద్వారా మోతీ బాగ్ సాహిబ్‎లో రిషబ్, అతని తల్లి ఆశ్రయం పొందారు. అక్కడే చాలా రాత్రులు బస చేసి, లంగర్‌లో భోజనం చేసి, ఆపై ప్రాక్టీస్ కోసం అకాడమీకి వెళ్ళి రిషబ్ పంత్ తన క్రికెట్ కెరీర్‌కు పునాది వేశాడు. ప్రపంచంలో ఏ మూల గురుద్వారా ఉన్నా ఆశ్రయం లభిస్తుంది. అయితే, మోతీ బాగ్ సాహిబ్ గురుద్వారా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనికి సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్‎తో సంబంధం ఉంది. గురు గోవింద్ సింగ్ జికి సంబంధించిన గురుద్వారాలో ఆశ్రయం పొంది క్రికెట్ కెరీర్ నిర్మించుకున్న పంత్‌లో కూడా అసాధారణమైన ధైర్యం పెరిగింది.

2017 ఐపీఎల్ సీజన్ సమయంలోనే పంత్ తండ్రి మరణించారు. కేవలం 19 ఏళ్ల వయసులో అంత పెద్ద షాక్‌ను తట్టుకుని, తండ్రి అంత్యక్రియలు ముగిసిన 24 నుండి 48 గంటల లోపే పంత్ బెంగళూరు వెళ్లి, అక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‎తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో 57 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బ్రిస్బేన్ అయినా, బర్మింగ్‌హామ్ అయినా లేదా కేప్‌టౌన్ టెస్ట్ అయినా, పంత్ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారత జట్టుకు అనేక మ్యాచ్-విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడి తన ధైర్యాన్ని, సంకల్పాన్ని చాటుకున్నాడు. ముఖ్యంగా 2022 డిసెంబర్‌లో జరిగిన భయంకరమైన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తర్వాత, కేవలం 15 నెలల్లోనే అతను జట్టులోకి తిరిగి వచ్చి, టీమ్ ఇండియాతో కలిసి టీ20 ప్రపంచ కప్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచాడు.

2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పంత్ ఇప్పటివరకు 47 టెస్ట్ మ్యాచ్‌లలో 44.50 సగటుతో 3427 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టి20 బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన పంత్ నేడు టెస్ట్ జట్టులో అత్యంత కీలక సభ్యుడు. 31 వన్డే మ్యాచ్‌లలో పంత్ 1 సెంచరీ సహాయంతో 871 పరుగులు, 76 టి20 మ్యాచ్‌లలో 3 హాఫ్ సెంచరీలు సహా 1209 పరుగులు చేశాడు. అలాగే, ఐపీఎల్‌లో 125 మ్యాచ్‌లలో పంత్ 3553 పరుగులు చేశాడు. 104 వికెట్లు కూడా పడగొట్టాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి