AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్‌ కోహ్లీకి ఏమైంది? అందరూ ఆయనను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు?

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అంతా సంక్లిష్ట సమయాన్ని చవి చూసిన వారే! ఆ సంక్షోభం నుంచి గట్టెక్కినవారే! ఫామ్‌ కోల్పోవడం అన్నది మానసిక సమస్యే! రెండు మూడు మ్యాచ్‌లు వరుసగా వైఫల్యం చెందితే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కొద్దిగా సన్నగిల్లుతుంది.

Virat Kohli: విరాట్‌ కోహ్లీకి ఏమైంది? అందరూ ఆయనను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు?
Virat Kohli
Balu
| Edited By: Ram Naramaneni|

Updated on: May 19, 2022 | 11:57 AM

Share

విరాట్‌ కోహ్లీకి ఏమైంది? అందరూ ఆయనను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? డక్‌ డక్‌ కర్నే లగా మోర జియారా కర్నే లగా అంటూ ఎగతాళి ఎందుకు చేస్తున్నారు? ఫామ్‌లో లేడనేగా! క్రీజ్‌లో పట్టుమని పావుగంట కూడా ఉండటం కష్టమవుతోంది ఆయనకు! వరల్డ్‌ బెస్ట్ బ్యాట్స్‌మన్‌ పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతుండటమన్నది బాధాకరమే! ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రెండు గోల్డెన్‌ డక్‌లు సాధించగానే సోషల్‌ మీడియాలో ఆయనపై ట్రోల్స్‌ మొదలయ్యాయి. నిజమే, ప్రస్తుతం ఆయన ఫామ్‌ ఏమీ బాగోలేదు. ఐపీఎల్‌లో ఆయన చేసినవి 216 పరుగులు మాత్రమే! ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో సెంచరీ సాధించి మూడేళ్లపైనే అయ్యింది. అప్పుడెప్పుడో 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడెంకల స్కోరు సాధించిన కోహ్లీ ఆ తర్వాత ఆ స్థాయి ఆట తీరును కనబర్చలేకపోతున్నాడు.

క్రికెట్‌లో కోహ్లీకి సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడిన అనుభవమూ ఉంది. అసలు కోహ్లీ లాంటి ఆటగాడు టీమిండియాలో ఉండటం దేశానికి గర్వకారణం. కోహ్లీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఆటగాడు. సమకాలికులలో కోహ్లీ అంత గొప్ప బ్యాట్స్‌మన్‌ ఎవరూ లేరన్నది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎవరైనా కోహ్లీ తర్వాతే! సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత మనకు దొరికిన ప్రతిభాశాలి కోహ్లీ. కోహ్లీ మిగతా ఆటగాళ్లతో చాలా భిన్నంగా కనిపిస్తారు. కోహ్లీలో ఓ రకమైన ధిక్కారం ఉంటుంది. దూకుడుతనం ఉంటుంది. లెక్క చేయని తత్వం ఉంటుంది. వీటితో పాటుగానే ఆత్మ విశ్వసం ఉంటుంది. బౌలర్లపై ఆధితప్యం ప్రదర్శించాలనే తపన ఉంటుంది. ఈ కారణాల వల్లే ఆయన బ్యాటింగ్‌ చూడ ముచ్చటగా ఉంటుంది. మైదానం నలువైపులా మిరుమిట్లుగొలిపే షాట్లు కొడుతూ ఉంటే రెప్పార్చకుండా చూస్తుండిపోతాం. ఇంతటి టాలెంట్‌ ఉంది కాబట్టే ప్రపంచమంతటా కోహ్లీ అభిమానులున్నారు. ప్రస్తుత నంబర్‌వన్‌ ప్లేయర్‌ బాబర్‌ ఆజ్మీ కూడా వినమ్రంగా తాను కోహ్లీకి వీర ఫ్యాన్‌నని చెప్పుకున్నాడు. ఆయనలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే కోరికను వెలిబుచ్చుకున్నాడు. ఏమైందో ఏమో ఇప్పుడు కోహ్లీ బ్యాట్‌ నుంచి మెరుపులు రావడం లేదు. ఓ సాధారణ ఆటగాడిలా మారిపోయాడు. ఆయన నైపుణ్యం ఒక్కసారిగా అదృశ్యమయ్యింది. పరుగులు సాధించడానికి చాలా కష్టపడుతున్నాడు.

ఏ బ్యాట్స్‌మన్‌కి కూడా బ్యాడ్‌ ఫామ్‌ ఇంతకాలం ఉంటుంది. అసలు ఫామ్‌లో లేకపోవడానికి కారణమేమిటి? ఎందుకిలా జరిగింది? వీటికి నేరుగా, క్లుప్తంగా సమాధానాలు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అంతా ఇలాంటి సంక్లిష్ట సమయాన్ని చవి చూసిన వారే! ఆ సంక్షోభం నుంచి గట్టెక్కినవారే! ఫామ్‌ కోల్పోవడం అన్నది మానసిక సమస్యే! రెండు మూడు మ్యాచ్‌లు వరుసగా వైఫల్యం చెందితే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం కొద్దిగా సన్నగిల్లుతుంది. అదే సమయంలో ఆ బ్యాట్స్‌మన్‌పై బౌలర్ల ఆధిపత్యం మొదలవుతుంది. ఎంచుకునే షాట్ల విషయంలో పొరపాట్లు దొర్లుతుంటాయి. స్వేచ్ఛగా ఆడలేకపోతారు. బాల్‌ను ఏ దిశగా తరలించాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడో, ఇతర వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టినప్పుడో ఆటగాళ్లు ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. మళ్లీ ఆటపై పట్టు సాధించాలనే పట్టుదల ఉన్నవారు మాత్రం త్వరగానే ఈ దశ నుంచి బయటపడతారు. పాతతరం బ్యాట్స్‌మెన్‌కు ఈ పట్టుదల ఎక్కువే! సునీల్‌ గవాస్కర్‌, గుండప్ప విశ్వనాథ్‌, మొహిందర్‌ అమర్‌నాథ్‌ వంటి ఆటగాళ్లు నిప్పులు చెరిగే బంతులను కూడా అవలీలగా ఎదుర్కోగలిగారంటే వారిలో ఉన్న పోరాట తత్వమే! ఏడో దశకంలో వెస్టిండీస్‌ బౌలర్లు గంటలకు 90 మైళ్ల వేగంతో బంతులను విసిరేవారు. మెరుపు వేగంతో దూసుకు వస్తున్న ఆ బంతులను సునాయాసంగా ఎదుర్కొనేవారు. అప్పట్లో భారత బౌలర్లలో ఈ రకమైన వేగం ఉండేది కాదు.. మహా అయితే గంటకు 75 మైళ్ల స్పీడ్‌తో బౌలింగ్‌ చేసేవారంతే! అంటే నెట్‌ ప్రాక్టీస్‌లో పేస్‌ బౌలింగ్‌ను ఆడే అవకాశం అంతగా ఉండేది కాదు. అయినప్పటికీ వెస్టిండీస్‌ పేస్‌ బౌలర్లను ఎదుర్కోగలిగారంటే గొప్ప విషయమే! అందుకే వారు సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో మనగలిగారు.

కొన్ని సందర్భాలలో చిన్న చిన్న కారణాల వల్ల కూడా ఫామ్‌ను కోల్పోవాల్సి వస్తుంది. మహ్మద్‌ అజరుద్దీన్‌నే తీసుకుందాం! ఓ దశలో బ్యాట్‌ గ్రిప్‌ను ఎలా ఉపయోగించాలో అజర్‌ మర్చిపోయాడు. ఫలితంగా పరుగులు సాధించడం అతడికి చాలా కష్టమయ్యింది. ఏం చేయాలో పాలుపోలేదతడికి. పాకిస్తాన్‌కు చెందిన జహీర్‌ అబ్బాస్‌కు అజరుద్దీన్‌ చేస్తున్న పొరపాటేమిటో అర్థమయ్యింది. జహీర్‌ ఇచ్చిన సూచనలను పాటించాడు అజర్‌. అంతే మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. అలాగే ఏడో దశకం నుంచి ఎనిమిదో దశకం వరకు ఇంగ్లాండ్‌ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఫిల్‌ ఎడ్మండ్స్‌ కు వింత పరిస్థితి ఎదురయ్యింది. రన్నప్‌ మర్చిపోయాడు. అది కూడా 1984-85లో ఇండియా పర్యటనకు ముందు. ఆ సమస్య నుంచి చాలా తొందరగా బయటపడగలిగాడు ఎడ్మండ్స్‌.. ఇండియా టూర్‌లో బాగానే రాణించాడు.

ఓ ఆటగాడు పూర్‌ ఫామ్‌ను ఎంత కాలమని కొనసాగిస్తాడు? ఫామ్‌లో లేడని తెలిసిన మరుక్షణమే సెలెక్టర్లు నిర్దాక్షిణ్యంగా అతడిని జట్టులోంచి తొలగిస్తారు. కానీ ఆట పట్ల అంకిత భావం ఉన్నవారు చాలా ఈజీగా సమస్యలను అధిగమించగలరు. క్రీస్‌లో రెండు మూడు గంటలు నిల్చోగలిగితే ఆటోమాటిక్‌గా కాన్ఫిడెన్స్‌ వస్తుంది. తన పూర్వ శైలిని దొరకపుచ్చుకోగలుగుతారు. ఒక్క సుదీర్ఘ ఇన్నింగ్స్‌ చాలు. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి. అవుటాఫ్‌ ఫామ్‌లో ఉన్నవారు చాలా సందర్భాలలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. తిరిగి ఫామ్‌లోకి రావడానికి రిస్కీ షాట్లు కొడుతుంటారు. అలాగే వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. బౌలర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటారు. ఇక్కడే విఫలమవుతుంటారు. అనవసరంగా వికెట్‌ను పారేసుకుంటుంటారు. ఇది కాన్ఫిడెన్స్‌ సన్నిగిల్లేలా చేస్తుంది. దీంతో ఆటగాళ్లు మరింత ఒత్తిడికి లోనవుతారు. ఎక్కడ పొరపాటు చేస్తున్నామో బ్యాట్స్‌మెన్‌ తెలుసుకోగలిగితే ఈజీగా మళ్లీ ఫామ్‌లోకి రావచ్చు. తమ నైపుణ్యంపై ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోవద్దు. కొన్ని షాట్లను నియంత్రించుకోగలగాలి. ఫామ్‌లో ఉన్నప్పుడు ఏ షాట్‌ను ఆడినా చెల్లుతుంది. ఫామ్‌లో లేనప్పుడే కష్టం. 2003-04లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్‌ టెండూల్కర్‌కు పరుగులు సాధించడం చాలా కష్టమయ్యింది. చాలా తక్కువ స్కోర్లకే అవుటవ్వసాగాడు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కవర్‌ డ్రైవ్‌ ఆడకూడదని డిసైడయ్యాడు. ఎందుకంటే ఆ సిరీస్‌లో చాలా మట్టుకు కవర్‌డ్రైవ్‌ ఆడేందుకు ప్రయత్నించే అవుటయ్యాడు. ఎప్పుడైతే కవర్‌డ్రైవ్‌ షాట్‌ను నియంత్రించుకోగలిగాడో అప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫలితంగా చివరి టెస్ట్‌లో అజేయంగా 241 పరుగులు సాధించగలిగాడు. సుమారు పది గంటల పాటు క్రీస్‌లో ఉండగలిగాడు. అందుకే అతడు నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ అయ్యాడు.

క్రికెట్‌ చరిత్రలో ఇంతకంటే దారుణమైన సంఘటన ఉంది. మొహిందర్‌ అమర్‌నాథ్‌ తెలుసుకదా! 1982-83లో పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో అమర్‌నాథ్‌ చోటు సంపాదించుకోగలిగాడు. చాలా కాలం తర్వాత ఆయనను జట్టులో తీసుకున్నారు. పాక్‌ టూర్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నది అమర్‌నాథ్‌ ఒక్కడే. ఆ సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌ పర్యటనల్లోనూ అమర్‌నాథ్‌ కీలకంగా మారాడు. వెస్టిండీస్‌ ఫాస్‌ బౌలర్లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. బౌన్సర్లతో భయపెట్టినా అమర్‌నాథ్‌ లెక్కపెట్టలేదు. రెండు సెంచరీలతో అదరగొట్టాడు. ఈ రెండు పర్యటనల తర్వాత జరిగిన ప్రపంచకప్‌లోనూ అమర్‌నాథ్‌ చెలరేగిపోయాడు. సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. వివ్‌ రిచర్డ్స్‌, ఇమ్రాన్‌ఖాన్‌ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రపంచంలోనే ఫాస్ట్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే ఏకైక మొనగాడు మొహిందర్‌ అంటూ వారిద్దరు కితాబిచ్చారు. వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాత భారత పర్యటనకు పాకిస్తాన్‌ వచ్చింది. ఆ సిరీస్‌లో మొహిందర్‌ ఓ మోస్తరు పరుగులు చేశాడు. హైదరాబాద్‌లో జరిగిన వన్డేలో మ్యన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు. పాక్‌ సిరీస్‌ ముగిసిన వెంటనే భారత పర్యటనకు వెస్టిండీస్‌ వచ్చింది. ఆ సిరీస్‌లో మొహిందర్‌ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాడు. క్రికెట్‌లో బేసిక్స్‌ కూడా తెలియవన్నట్టుగా ఆడాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో మొహిందర్‌ స్కోరు ఎలా ఉందంటే 0,0,1,0,0,0. మొహిందర్‌ పని అయిపోయిందని అనుకున్నారంతా! కానీ ఏడాదిలోనే కోల్పోయిన ఫామ్‌ను తిరిగి సంపాదించుకున్నాడు. 1984లో పాక్‌లో ఇండియా పర్యటించినప్పుడు మొదటి టెస్ట్‌లోనే సెంచరీ సాధించాడు. దటీస్‌ అమర్‌నాథ్‌!

Mohinder Amarnath

Mohinder Amarnath

ఫామ్‌ అనేది తాత్కాలికం. క్లాస్‌ అనేది శాశ్వతం అంటారు. ఎంతటి తోపు బ్యాట్స్‌మెన్‌ అయినా ఏదో ఒక దశలో ఫామ్‌ను కోల్పోతాడు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ప్లేయర్లకు పరుగుల దాహం ఎక్కువగా ఉంటుంది. కోహ్లీ విషయానికి వస్తే కెప్టెన్సీని కోల్పోయినప్పటి ఆటపై అంతగా ఏకాగ్రత చూపడం లేదు. దాదాపు దశాబ్ధం నుంచి ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాడు కోహ్లీ. ఇది అతడి శారరీక, మానసిక స్థితులపై ప్రభావం చూపినట్టుంది. కోహ్లీ క్లాస్‌ ప్లేయర్‌ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు కోహ్లీకి కావాల్సింది కొంత కాలం విశ్రాంతి. ఆ టైమ్‌లో బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ను మెరుగుపర్చుకోవచ్చు. ఓ చిన్న బ్రేక్‌ ఎంతో అవసరం. రీఛార్జ్‌ అవ్వడానికి దోహదపడుతుంది. ఒక్కసారి కోహ్లీ ఫామ్‌లోకి వస్తే ఇక అతడికి ఎదురే ఉండదు. రికార్డులు ఒక్కొక్కటిగా బద్దలవ్వడం ఖాయం! ఆల్‌ ది బెస్ట్‌ కోహ్లీ.