IND Vs SA: వచ్చారు.. శనిలా దాపురించారు.! అప్పుడు కోహ్లి, రోహిత్.. ఇప్పుడు ధోని టీమ్‌మేట్.. కెరీర్ ఇక అస్సామే
భారత జట్టులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శుభమాన్ గిల్ కోసం సంజూ శాంసన్ కెరీర్‌ను బలి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, షమీ వంటి స్టార్ ఆటగాళ్ల కెరీర్‌లను కూడా..

టీమిండియాలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టు అంతటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని చాలామంది మాజీలు ఇప్పటికే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ పెద్దల మద్దతుతో గంభీర్ చెప్పిందే వేదంగా మారిందని, జట్టులో అతడు ఉండాలనుకున్న ఆటగాడు ఉంటాడు. వద్దనుకున్నాడు ఆటగాడు బెంచ్‌కే పరిమితమవుతాడు. దీన్ని బట్టి చూస్తే స్టార్ ప్లేయర్ అయినా.. పక్కకు తప్పుకోవాల్సిందే. అలాగే అనామకుడు అందలం ఎక్కుతాడు. తాజాగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైన విషయం విదితమే. ఈ క్రమంలోనే కటక్‌కు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో శుభమాన్ గిల్ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన గిల్, గాయం నుంచి కోలుకోగానే నేరుగా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. వాస్తవానికి ఓపెనర్‌గా సంజూ శాంసన్ ఆడాల్సి ఉండగా.. అతడి స్థానంలో గిల్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఇదిలా ఉంటే.. సంజూ గత కొంతకాలంగా ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అయినా శాంసన్‌ను జట్టు నుంచి తీసేశారు. గిల్ కోసం సంజూ కెరీర్‌ను గంభీర్, అగార్కర్ బలి చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. మొదట జట్టులో ఓపెనర్‌గా రాణిస్తున్న సంజూ బ్యాటింగ్ పొజిషన్లలో మార్పులు చేయగా.. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం జట్టులో అతని ప్లేస్‌ను గల్లంతు చేశారు.
ఇదే తంతు గతంలో ఆస్ట్రేలియా పర్యటనలోనూ జరిగింది. తొలి టీ20లో సంజూ శాంసన్ ఉండగా.. రెండో టీ20లో సంజూను గెంటేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లోనూ అదే కొనసాగింది. దీంతో సంజూ కెరీర్ ఇక ఖతం అనే వాదన వినిపిస్తోంది. హెడ్ కోచ్ గంభీర్ మొదట సంజూ కెరీర్‌కు భరోసా ఇచ్చాడని.. 21 సార్లు డకౌట్ అయినా తుది జట్టులో ఉంటాడని స్పష్టం చేసినట్టు.. ఆనాడు చెప్పిన మాటలను ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లో తన మాట వినే కెప్టెన్‌ను తెచ్చుకోవడానికి సంజూ కెరీర్‌ను బలి చేస్తున్నారన్నారు.
గంభీర్‌కు ఆటగాళ్ల కెరీర్లతో ఆటాడుకోవడం కొత్తేమీ కాదని, గతంలో దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో మైండ్ గేమ్ ఆడి, వారంతట వారే టెస్ట్ కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించుకునేలా చేశాడని అంటున్నారు. ఇప్పుడు టీ20లో గిల్ కోసం సంజూ కెరీర్‌ను పణంగా పెట్టిన గంభీర్.. మరో అనామక బౌలర్ కోసం షమీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కెరీర్‌ను ముగించేశాడని ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో గంభీర్ ఇంకా ఎన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటాడోనని భయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి








