AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవడ్రా సామీ నువ్వు.. ఒకే ఇన్నింగ్స్ లో 18 సిక్సర్లా.. టీ20 క్రికెట్ లోనే డేంజరస్ ఇన్నింగ్స్..

T20 cricket records: టీ20 క్రికెట్ చరిత్రలో సిక్సర్ల కింగ్ అంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు క్రిస్ గేల్. 2017లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో గేల్ ఆడిన ఆ ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ఒకే ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు బాది సరికొత్త రికార్డు సృష్టించిన ఆ 'యూనివర్స్ బాస్' బ్యాటింగ్ విధ్వంసం ముందు హేమాహేమీ బౌలర్లు సైతం నిస్సహాయులైపోయారు.

ఎవడ్రా సామీ నువ్వు.. ఒకే ఇన్నింగ్స్ లో 18 సిక్సర్లా.. టీ20 క్రికెట్ లోనే డేంజరస్ ఇన్నింగ్స్..
Chris Gayle 18 Sixes Record
Venkata Chari
|

Updated on: Apr 03, 2026 | 11:34 AM

Share

Chris Gayle 18 Sixes Record: క్రికెట్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించడం క్రిస్ గేల్‌కు వెన్నతో పెట్టిన విద్య. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుత రికార్డులను నెలకొల్పిన గేల్, 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఆడిన ఇన్నింగ్స్ ఒక అద్భుతం. రంగ్‌పూర్ రైడర్స్ తరపున బరిలోకి దిగిన గేల్, ఢాకా డైనమైట్స్ బౌలర్లను చీల్చి చెండాడాడు. కేవలం 69 బంతుల్లోనే 146 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ భారీ స్కోరులో ఏకంగా 18 సిక్సర్లు ఉండటం విశేషం. అప్పట్లో ఒక టీ20 ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక సిక్సర్ల రికార్డు.

నెమ్మదిగా మొదలై.. సునామీలా మారి..

ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను గేల్ చాలా నెమ్మదిగా ప్రారంభించాడు. మొదటి 28 బంతుల్లో కేవలం ఒక్క సిక్సర్ సాయంతో 35 పరుగులు మాత్రమే చేశారు. కానీ ఒక్కసారి గేర్ మార్చిన తర్వాత మైదానంలో సిక్సర్ల సునామీ మొదలైంది. తర్వాతి 41 బంతుల్లో ఏకంగా 17 సిక్సర్లు బాది 113 పరుగులు పిండుకున్నాడు. తన మొత్తం 146 పరుగులలో 108 పరుగులు కేవలం సిక్సర్ల ద్వారానే రావడం ఆయన విధ్వంసానికి నిదర్శనం.

దిగ్గజ బౌలర్లకే చుక్కలు చూపించి..

సాధారణంగా ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. కానీ ఆ రోజు గేల్ ఆటకు పిచ్ పరిస్థితులు అడ్డుకాలేదు. ప్రపంచ స్థాయి బౌలర్లు అయిన షకీబ్ అల్ హసన్, సునీల్ నరేన్, మహ్మద్ అమీర్ వంటి వారి బౌలింగ్‌ను గేల్ ఊచకోత కోశాడు. బంతి ఎక్కడ వేసినా అది స్టేడియం బయట పడాల్సిందే అన్నట్లుగా ఆయన బ్యాటింగ్ సాగింది. గేల్ మెరుపులతో రంగ్‌పూర్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించి, చివరకు 57 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది.

రికార్డుల వేటలో మరొకరు..

దాదాపు ఎనిమిదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉన్న గేల్ 18 సిక్సర్ల రికార్డును, 2025లో న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ అధిగమించారు. అమెరికాలో జరిగిన ఒక లీగ్‌లో అలెన్ 19 సిక్సర్లు బాది గేల్ రికార్డును దాటారు. అయినప్పటికీ, ఒక ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిలో, అగ్రశ్రేణి బౌలర్లపై గేల్ చూపించిన ఆ పోరాటం క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us