IPL 2025: చరిత్ర సృష్టించిన బూమ్ బూమ్.. ఆ లిస్ట్ లో మనోడే తోపు.. మలింగ కూడా వెనకే!
ఐపీఎల్ 2025లో ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన అద్భుత బౌలింగ్‌తో చరిత్ర సృష్టించాడు. ఢిల్లీపై 3/12 తీసి ఐపీఎల్‌లో 25వసారి మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ముంబై 180 పరుగులు చేసి, బౌలింగ్‌లో బుమ్రా, సాంట్నర్ ప్రదర్శనతో ఢిల్లీని కేవలం 121 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత పొందగా, బుమ్రా తన స్థాయిని మరోసారి రుజువు చేశాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబైలో జరిగిన నాకౌట్ తరహా మ్యాచ్‌లో బుమ్రా 3 వికెట్లు తీసి (3/12) ముంబై విజయానికి కీలకంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఐపీఎల్‌లో 25వసారి మూడు వికెట్లు తీసిన ఘనతను సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఎవరి వద్దలేని రికార్డు. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అత్యధికసార్లు మూడు వికెట్లు తీసిన ఘనతను బుమ్రా ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో బుమ్రా తర్వాత యుజవేంద్ర చాహల్ (22), లసిత్ మలింగ (19), రవీంద్ర జడేజా (17), అమిత్ మిశ్రా (17), సునీల్ నరైన్ (17), హర్షల్ పటేల్ (17) ఉన్నారు.
ఇప్పటికే బుమ్రా ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లసిత్ మలింగ రికార్డును అధిగమించాడు. బుమ్రా ఇప్పటి వరకు 181 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ చరిత్రలో మొత్తం వికెట్లలో ఆరో స్థానంలో నిలిచాడు. పేసర్లలో బుమ్రా మూడవ స్థానాన్ని ఆక్రమించాడు. ఈ సీజన్‌లో బుమ్రా 9 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా ఆధ్వర్యంలో ముంబై బౌలింగ్ యూనిట్ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను పూర్తిగా కట్టడి చేసింది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో నమన్ ధీర్ కేవలం 8 బంతుల్లో 24 పరుగులు చేసి స్కోరును వేగంగా పెంచాడు. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో ముంబై 48 పరుగులు సాధించడం ఢిల్లీపై ఒత్తిడిని పెంచింది. 19వ ఓవర్‌లో ముఖేష్ కుమార్ ఒక్కడే 27 పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీసాడు, చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య చేధనలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులకు ఆలౌట్ అయింది. సమీర్ రిజ్వీ 35 బంతుల్లో 39 పరుగులు చేసి ఒక్కడే పోరాడినట్టు కనిపించాడు. విప్రజ్ నిగమ్ 20 పరుగులు చేశాడు కానీ మిగతా బ్యాటర్లు తీవ్రంగా విఫలమయ్యారు. ముంబై బౌలింగ్ యూనిట్ విజృంభించగా మిచెల్ సాంట్నర్ 3/11, బుమ్రా 3/12 తో ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. దీంతో 59 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత పొందింది. బుమ్రా ఈ మ్యాచ్‌తో మళ్లీ ఒకసారి తన క్లాస్‌ను రుజువు చేసి, ఐపీఎల్ చరిత్రలో తన స్థానం మరింత శక్తిగా నిలిపాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



