Video: క్రికెట్ చరిత్రలోనే విచిత్ర రనౌట్.. లంక కీపర్ చేసిన పనితో షాకైన టీమిండియా యంగ్ ప్లేయర్..?
Priyansh Arya Run Out Video: మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమ్ ఇండియా 'ఎ' 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Priyansh Arya Run Out Video: శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా ‘ఎ’ యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన విధానం ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనంగా మారింది. క్రీజులోకి రాకుండా ప్రత్యర్థి వికెట్ కీపర్ కాలు అడ్డుపడటంతో జరిగిన ఈ విచిత్ర రనౌట్ తీవ్ర వివాదానికి దారితీయడమే కాకుండా, సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు తెరలేపింది.
దంబల్లా మైదానంలో ఊహించని హైడ్రామా..
దంబల్లా వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్ తొలి మ్యాచ్‌లోనే ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో మూడో స్థానంలో బరిలోకి దిగిన ప్రియాంశ్ ఆర్య అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న సమయంలో ఈ విచిత్ర నాటకం జరిగింది.
భారత ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ లాంగ్-ఆఫ్ దిశగా బంతిని బాది రెండో రన్ కోసం ప్రియాంశ్ ఆర్యను పిలిచాడు. అయితే ఆర్య మొదట పరిగెత్తడానికి కాస్త సంకోచించాడు. కానీ అప్పటికే గైక్వాడ్ పిచ్ మధ్యలోకి వచ్చేయడంతో, ఇద్దరి మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. చివరకు ఇద్దరూ రనౌట్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఒకే వైపు (స్ట్రైకర్ ఎండ్) ఉన్న క్రీజు వైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు లంకించుకున్నారు.
బ్యాట్‌ను లాక్ చేసిన నిరోషన్ డిక్వెల్లా..
అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇద్దరు బ్యాటర్లు ఒకే క్రీజు వైపు దూసుకువస్తుండగా, స్ట్రైకర్ ఎండ్ వద్ద బంతిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా కాలు ప్రియాంశ్ ఆర్య బ్యాట్‌కు అడ్డుగా వచ్చింది. ఆర్య తన బ్యాట్‌ను క్రీజు గీత లోపలికి నెట్టడానికి ప్రయత్నించినప్పటికీ, డిక్వెల్లా కాలి కింద బ్యాట్ చిక్కుకుపోవడంతో అది సాధ్యం కాలేదు.
ఈ లోపు రుతురాజ్ గైక్వాడ్ వేగంగా వచ్చి క్రీజులో బ్యాట్ పెట్టి సురక్షితంగా నిలిచాడు. వెంటనే సమయస్ఫూర్తి ప్రదర్శించిన డిక్వెల్లా.. బంతిని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరి స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు సైతం అసలేం జరిగిందో తెలియక కాసేపు అయోమయంలో మునిగిపోయారు.
థర్డ్ అంపైర్ నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం..
Weird way to get run out 😭😭
What’s happening, Priyansh Arya got stopped by Dickwella to save Ruturaj 😭 pic.twitter.com/sLOFIg50VT
— HK (@potter_here18) June 9, 2026
ఈ గందరగోళ రనౌట్‌ను పరిశీలించిన థర్డ్ అంపైర్.. ఇద్దరూ ఒకే క్రీజులోకి వచ్చినప్పుడు గైక్వాడ్ ముందుగా గీత దాటినట్లు గుర్తించారు. దీంతో నిబంధనల ప్రకారం 32 పరుగులు చేసిన ప్రియాంశ్ ఆర్య అవుట్ అయినట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై క్రికెట్ ప్రపంచం తీవ్రంగా మండిపడుతోంది.
క్రికెట్ నిబంధనల (MCC రూల్ 37) ప్రకారం.. ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు ఉద్దేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ బ్యాటర్ పరుగుకు అడ్డుపడితే దానిని ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కింద పరిగణించి నాటౌట్‌గా ప్రకటించాలని నెటిజన్లు వాదిస్తున్నారు. కానీ, కీపర్ డిక్వెల్లా కావాలని కాలు అడ్డుపెట్టలేదని, అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిందని అంపైర్లు భావించడంతో ఆర్య నిరాశగా పెవిలియన్ చేరక తప్పలేదు.
ఈ విచిత్రమైన, వివాదాస్పద వికెట్ కోల్పోయినప్పటికీ, భారత యువ సింహాలు పట్టువదల్లేదు. మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికేట్ల నష్టానికి 277 పరుగులు చేసిన టీమిండియా, ఆ తర్వాత లంకను 269 పరుగులకే ఆలౌట్ చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో భారత్ ‘ఎ’ జట్టు 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విమర్శకులకు సమాధానం ఇచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
