England Vs New Zealand: తమ అభిమాన ఆటగాళ్లు అద్భుతంగా ఆడినప్పుడు ప్రేక్షకులు వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొన్ని సార్లు ఆ అభిమానం హద్దులు మీరుతుంది. చూడడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల అత్యుత్సాహం కూడా ఇలాగే మారింది. లీడ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్ స్టో (Jonny Bairstow) వీరోచిత సెంచరీ సాధించాడు. అయితే అతను సెంచరీ పూర్తి చేయగానే బర్మీ ఆర్మీగా పిలుచుకునే కొందరు అభిమానులు బెయిర్ స్టో మీదకు తాము వేసుకున్న చెప్పులు, షూస్ తీసి చూపించారు. అయితే ఇది కూడా ఒక సెలబ్రేషన్ అట. అభిమాన ఆటగాడు అద్భుతంగా ఆడినప్పుడు ఇలా వెరైటీగా సెలబ్రేట్ చేసుకోవడం బర్మీ ఆర్మీకి అలవాటేనట. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసి క్రికెట్ అభిమానులు, నెటిజన్లు విస్తుపోతున్నారు. ‘ఇదేం పైత్యంరా బాబూ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 329 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 55 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే బెయిర్ స్టో (130 బ్యాటింగ్) మరోసారి రెచ్చిపోయాడు. టీ20 ఆటను తలపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. జెమీ ఓవర్టన్ (89 నాటౌట్) తో కలిసి ఏడో వికెట్ కు 209 పరుగులను జోడించాడు. అయితే బెయిర్ స్టో శతకం చేసిన తర్వాత బర్మీ ఆర్మీ అభిమానులు.. తాము వేసుకున్న షూస్, చెప్పులు తీసి వాటిని చేత పట్టుకుని అతడికి అభివాదం చేశారు. ‘మీరు బెయిర్ స్టో అభిమానులైతే షూస్ తీయండి’ అని హెడ్డింగ్లీ స్టేడియం హోరెత్తిపోయింది. గ్యాలరీల్లోని ప్రేక్షకుల్లో చాలా మంది షూస్, చెప్పులు తీసి ‘బెయిర్ స్టో.. బెయిర్ స్టో’ అని గట్టిగా అరవడం గమనార్హం. కాగా ఈ వీడియోను బర్మీ ఆర్మీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.
? Shoes off, if you love Bairstow! ?#ENGvNZ pic.twitter.com/AAQ2vKUjNS
— Jonny Bairstow’s Barmy Army (@TheBarmyArmy) June 24, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..