AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను పాకిస్తాన్ రంగేసుకున్న ఆసీస్ క్రికెటర్‌ని.. రిటైర్మెంట్‌తో ఊహించని షాక్..

Usman Khawaja Retirement: రిటైర్మెంట్ ప్రకటిస్తూనే ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఇంకా నెలకొన్న 'జాతి వివక్ష' (Racial Stereotyping) ధోరణిపై ఖవాజా విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా యాషెస్ తొలి టెస్టులో తను గాయపడినప్పుడు మీడియా, కొంతమంది మాజీ ఆటగాళ్లు తన పట్ల ప్రవర్తించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు.

నేను పాకిస్తాన్ రంగేసుకున్న ఆసీస్ క్రికెటర్‌ని.. రిటైర్మెంట్‌తో ఊహించని షాక్..
Usman Khawaja Retirement
Venkata Chari
|

Updated on: Jan 02, 2026 | 11:31 AM

Share

Usman Khawaja Retirement: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో యాషెస్ టెస్ట్ (సిడ్నీ) తన కెరీర్‌లో చివరిదని ఆయన ప్రకటించాడు. అయితే, ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. తన 15 ఏళ్ల కెరీర్‌లో ఎదుర్కొన్న వివక్షను, జాత్యహంకార ధోరణిపై విచారం వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. 39 ఏళ్ల ఈ వెటరన్ ఆటగాడు, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా జనవరి 4 నుంచి ప్రారంభం కానున్న ఐదో యాషెస్ టెస్టు తర్వాత రిటైర్ అవుతున్నట్లు శుక్రవారం ధృవీకరించాడు.

నేను ఒక ‘రంగున్న’ పాకిస్థానీ అబ్బాయిని..

రిటైర్మెంట్ సందర్భంగా ఖవాజా ఒక భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. “నేను పాకిస్థాన్ నుంచి వచ్చిన ఒక రంగున్న అబ్బాయిని. నేను ఆస్ట్రేలియా తరపున ఆడలేనని చాలామంది ముఖం మీదే చెప్పారు. కానీ ఈ రోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. మీ కలను మీరు నమ్మితే ఏదైనా సాధించవచ్చు” అని యువతకు సందేశమిచ్చాడు. పాకిస్థాన్‌లో జన్మించి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన ఖవాజా, ఆ దేశం తరపున ఆడిన మొదటి ముస్లిం ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

మీడియా, మాజీ ఆటగాళ్లపై తీవ్ర అసహనం..

“నాకు వెన్నునొప్పి వచ్చినప్పుడు అది నా నియంత్రణలో లేదు. కానీ మీడియా, మాజీ ప్లేయర్స్ నన్ను టార్గెట్ చేస్తూ ఐదు రోజుల పాటు విమర్శించారు. నేను సోమరిని అని, జట్టు పట్ల నిబద్ధత లేదని ముద్ర వేశారు. పాకిస్థానీలు లేదా ఇతర రంగున్న ఆటగాళ్లు స్వార్థపరులని, జట్టు కోసం ఆడరని పాతకాలపు ఆలోచనలతో నన్ను దూషించారు. మనం ఇంకా ఆ జాత్యహంకార ధోరణి నుంచి బయటపడలేదని ఈ ఘటన నాకు అర్థమయ్యేలా చేసింది” అని ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అద్భుతమైన కెరీర్ 2011లో ఇంగ్లండ్‌పైనే సిడ్నీలో అరంగేట్రం చేసిన ఖవాజా, తిరిగి అదే జట్టుపై అదే మైదానంలో తన కెరీర్‌ను ముగించబోతున్నారు. ఇప్పటివరకు:

టెస్టులు: 87 (6,206 పరుగులు, 16 సెంచరీలు)

వన్డేలు: 40

టీ20లు: 9

2023లో ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆయన, ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది శ్రీలంకపై చేసిన 232 పరుగులు ఆయన కెరీర్‌లో అత్యధిక స్కోరు.

“నిష్క్రమణ ఎప్పుడూ గౌరవప్రదంగా ఉండాలి. నా సొంత మైదానం సిడ్నీలో రిటైర్ అవ్వడం నాకు గర్వంగా ఉంది” అని ఖవాజా పేర్కొన్నాడు. సెలక్టర్లు తనను తప్పించకముందే, తన నిర్ణయాన్ని తనే స్వయంగా ప్రకటించి గౌరవంగా తప్పుకోవాలని భావించినట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఏది ఏమైనా, ఒక గొప్ప బ్యాటర్‌గా మాత్రమే కాకుండా, వివక్షపై గొంతు ఎత్తిన ధైర్యవంతుడిగా ఖవాజా చరిత్రలో నిలిచిపోతాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..