Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు ముందే వివాదం.. లార్డ్స్‌లో ఆసీస్‌కు ఘోర అవమానం.. టీమిండియా ఎఫెక్ట్ అంటూ..

South Africa vs Australia: ఆదివారం నాడు ఆస్ట్రేలియా జట్టుకు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లభించినప్పటికీ, ఒక రోజు ముందు జరిగిన ఈ సంఘటన మాత్రం వివాదాన్ని చల్లార్చలేకపోయింది. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) లేదా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు ముందే వివాదం.. లార్డ్స్‌లో ఆసీస్‌కు ఘోర అవమానం.. టీమిండియా ఎఫెక్ట్ అంటూ..
Wtc Final Aus Vs Sa
Follow us
Venkata Chari

|

Updated on: Jun 09, 2025 | 6:36 PM

WTC Final 2025: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్స్‌కు ముందు అనూహ్యంగా ఓ వివాదం చెలరేగింది. ఫైనల్ మ్యాచ్‌కు వేదికైన చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో శిక్షణ తీసుకునేందుకు ఫైనలిస్ట్ ఆస్ట్రేలియా జట్టుకు శనివారం అనుమతి నిరాకరించడం, అదే సమయంలో భారత జట్టు అక్కడ ప్రాక్టీస్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.

అసలేం జరిగిందంటే?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఈ టైటిల్ పోరు జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ కీలక మ్యాచ్ కోసం సిద్ధమయ్యేందుకు ఆస్ట్రేలియా జట్టు శనివారం, జూన్ 8న లార్డ్స్‌లో శిక్షణా సెషన్‌ను ప్లాన్ చేసుకుంది. అయితే, మైదానం అందుబాటులో లేదని, వారికి అనుమతి నిరాకరించినట్లు ఆస్ట్రేలియా మీడియా “ఫాక్స్ క్రికెట్” కథనాన్ని ప్రచురించింది.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో, ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం అక్కడికి చేరుకున్న భారత జట్టు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం వివాదానికి ఆజ్యం పోసింది. వాస్తవానికి, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ భాగం కాదు. ఇంగ్లండ్‌తో భారత్ ఆడబోయే సిరీస్‌లోని మూడో టెస్టు జులై 10న లార్డ్స్‌లో జరగాల్సి ఉంది. ఫైనల్ ఆడనున్న జట్టును కాదని, సంబంధం లేని జట్టుకు ప్రాధాన్యత ఇవ్వడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిణామంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు శిక్షణ కోసం లండన్‌లోని బెక్స్‌హామ్‌కు మూడు గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. ఇది ఆసీస్ శిబిరంలో తీవ్ర అసంతృప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.

విమర్శలు..

ఫైనల్ ఆడనున్న తమ జట్టును కాదని, భారత జట్టుకు ఎలా అనుమతిస్తారని ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రభావానికి ఇది నిదర్శనమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ విషయాన్ని పెద్దదిగా చేయలేదు. గతంలో యాషెస్ సిరీస్ సందర్భంగా లార్డ్స్‌లో తమకు ఎదురైన చేదు అనుభవాలతో పోలిస్తే ఈసారి అంతా ప్రశాంతంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

ఆదివారం నాడు ఆస్ట్రేలియా జట్టుకు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లభించినప్పటికీ, ఒక రోజు ముందు జరిగిన ఈ సంఘటన మాత్రం వివాదాన్ని చల్లార్చలేకపోయింది. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) లేదా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

మొత్తంమీద, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు ఇలాంటి వివాదం చోటుచేసుకోవడం క్రీడా స్ఫూర్తికే విఘాతమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..