Women’s World Cup 2022: అగ్రస్థానం చేరిన ఆస్ట్రేలియా.. వరుసగా ఆరో విజయం.. కీలక పోరులో దక్షిణాఫ్రికా ఓటమి
దక్షిణాఫ్రికాను ఓడించి వరుసగా ఆరో విజయానికి ఆస్ట్రేలియా ఉమెన్స్ స్క్రిప్ట్ రాశారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(Women’s World Cup 2022) పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా(Australia) టీం అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా(AUSW vs SAW)ను ఓడించి టోర్నమెంట్‌లో వరుసగా ఆరో విజయాన్ని సాధించింది. మరోవైపు టోర్నీలో దక్షిణాఫ్రికా తొలి ఓటమిని చవిచూసింది. అంతకుముందు సౌతాఫ్రికా తన మొదటి నాలుగు మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీం నిర్ణత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. వొల్వార్ట్డ్ 90 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సునే లాస్ 52, లీ 36, కప్ప్ 30 (నాటౌట్) ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో షుట్, జోనాస్సెన్, గార్డనర్, సదర్లాండ్, అలనా రాజు తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం కేవలం 45.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో సారథి మెగ్ లానింగ్ 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అద్భుత ఇన్నింగ్స్‌తో టీంకు విజయాన్ని అందించింది. దీంతో మెగ్ లానింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. దీంతో ఇప్పటివరకు ఈ టోర్నీలో ఓడిపోని జట్టుగా ఆస్ట్రేలియా ఉమెన్స్ నిలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ 2, క్లో ట్రయాన్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ పట్టికను ఓసారి పరిశీలిస్తే ఆస్ట్రేలియా టీం 6 మ్యాచుల్లో 6 విజయాలు 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సౌతాఫ్రికా టీం 5 మ్యాచుల్లో 4 విజయాలు, 1 ఓటమి 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో వెస్టిండీస్ టీం 6 మ్యాచుల్లో 3 విజయాలు, 3 ఓటములు, 6 పాయింట్లతో నిలిచింది. ఇక నాలుగో స్థానంలో టీమిండియా నిలిచింది. మిథాలీసేన 5 మ్యాచుల్లో 2 విజయాలు, 3 పరాజయాలు, 4 పాయింట్లతో నిలిచింది.