IND vs PAK: ఓటమికి ప్రతీకారం నుంచి కోహ్లి రీఎంట్రీ వరకు.. భారత్-పాక్ మ్యాచ్‌ని ప్రత్యేకంగా మార్చే 5 అంశాలు ఇవే..
Asia cup 2022: ఆసియా కప్ 2022 లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈరోజు జరగనున్న మ్యాచ్‌కు ఎంతో ప్రత్యేకతనిచ్చే 5 విషయాలు తెలుసుకుందాం..
Asia cup 2022, India vs Pakistan T20I: ఆసియా కప్ 2022లో భారత జట్టు ఈరోజు (ఆగస్టు 28) తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు పాకిస్థాన్ జట్టు కమాండ్ బాబర్ ఆజం బాధ్యతలు చేపట్టనున్నాడు.
రాజకీయ, దౌత్య సంబంధాల కారణంగా భారత్-పాకిస్థాన్ జట్లు ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు. ఐసీసీ టోర్నీలు లేదా ఆసియా కప్‌లో మాత్రమే రెండు దేశాలు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు జరగనున్న మ్యాచ్‌కి ప్రత్యేకతనిచ్చే ఐదు అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లి పునరాగమనం: క్రికెట్‌కు 41 రోజుల విరామం ఇచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో కోహ్లీకి విశ్రాంతి లభించింది. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో కూడా అతను భాగం కాలేదు. ఆసియా కప్ కోసం కోహ్లీ మానసికంగా తాజాగా ఉండటానికి ఈ విరామం తప్పక సహాయపడుతుందని భావిస్తున్నారు. కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లో లేడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి బ్యాట్ పాకిస్థాన్‌పై భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం: గతేడాది దుబాయ్‌లోని ఇదే మైదానంలో టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడగా, బాబర్ అజామ్ జట్టు 10 వికెట్ల తేడాతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్ ఇండియాను ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు ఆ ఓటమిని ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే గొప్ప అవకాశం భారత జట్టుకు దక్కింది.
కెప్టెన్‌గా పాక్‌పై రోహిత్ శర్మ మొదటి టీ20: రోహిత్ శర్మ పాకిస్తాన్‌తో మొదటిసారి టీ20 ఇంటర్నేషనల్‌లో కెప్టెన్‌గా కనిపించబోతున్నాడు. కాగా, రోహిత్ గతంలో పాకిస్థాన్‌తో జరిగిన రెండు వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2021 టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత రోహిత్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించడం గమనార్హం. ఆ తర్వాత వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్సీ కూడా అప్పగించారు.
హార్దిక్‌కి స్పెషల్ మ్యాచ్: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ చాలా స్పెషల్ కానుంది. దుబాయ్‌లో జరిగిన 2018 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో బౌలింగ్ చేస్తున్నప్పుడు పాండ్యా నడుము నొప్పితో బాధపడ్డాడు. ఈ కారణంగా అతను స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ గాయం పాండ్యాకు చాలా కాలంగా సమస్యగా ఉంది. అయితే ఇప్పుడు గత 8-9 నెలలుగా పూర్తిగా లయలో కనిపిస్తూ బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
స్టేడియంలో ప్రేక్షకుల రద్దీ: దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకుల సందడి నెలకొంది. ఈ మ్యాచ్‌ని చూసేందుకు ఇరు దేశాల నుంచి వేలాది మంది క్రికెట్ అభిమానులు స్టేడియంకు తరలివస్తారు. టిక్కెట్లు సేల్‌కు వచ్చిన వెంటనే బుక్కవ్వడమే ఈ మ్యాచ్ ప్రత్యేకతను చాటుతోంది.